Warangal Airport: మళ్లీ మొదటికొచ్చిన వరంగల్ ఎయిర్ పోర్టు సమస్య… భూమికి భూమి ఇవ్వాల్సిందేనంటున్న రైతులు-warangal airport issue farmers demands land should be given for land ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Airport: మళ్లీ మొదటికొచ్చిన వరంగల్ ఎయిర్ పోర్టు సమస్య… భూమికి భూమి ఇవ్వాల్సిందేనంటున్న రైతులు

Warangal Airport: మళ్లీ మొదటికొచ్చిన వరంగల్ ఎయిర్ పోర్టు సమస్య… భూమికి భూమి ఇవ్వాల్సిందేనంటున్న రైతులు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 11, 2024 08:35 AM IST

Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు భూ సేకరణ ప్రక్రియ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు అవసరమైన 253 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేస్తూ నవంబర్ 17న ఉత్తర్వులు జారీ చేయగా.. రైతులు భూమి కావాలని పట్టుబడుతున్నారు.

వరంగల్‌ ఎయిర్‌ పోర్ట్ భూసేకరణపై రైతుల అభ్యంతరం
వరంగల్‌ ఎయిర్‌ పోర్ట్ భూసేకరణపై రైతుల అభ్యంతరం

Warangal Airport: వరంగల్‌ విమానాశ్రయ వ్యవహారం మొదటికొచ్చింది. భూమికి భూమి పరిహారం కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ మార్కెట్ రేట్ ప్రకారం నామ్ కే వాస్తే అన్నట్టుగా పరిహారం ఇచ్చి భూములు లాక్కునే ప్రయత్నాల్లో ఉందని మండిపడుతున్నారు. ఈ మేరకు ఇదే విషయమై మంగళవారం వరంగల్ ఆర్డీవో ను కలిసిన కొందరు రైతులు.. భూమికి భూమి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే తాము ఎయిర్ పోర్టు పునరుద్ధరణ కోసం తమ జీవనాధారమైన సాగు భూములను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు భూ సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

253 ఎకరాలే అసలు సమస్య

మామునూరు విమానాశ్రయానికి గతంలో మొత్తంగా 1,875 ఎకరాల స్థలం ఉండేది. ఈ స్థలంలో 6.6 కి.మీ రన్ వే, పైలట్, సిబ్బంది క్వార్టర్స్, పైలట్ శిక్షణ కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినళ్లు ఉండేవి. కానీ విమానాశ్రయానికి చెందిన 468 ఎకరాల భూమిలో మామునూరు టీజీఎస్పీ ఫోర్త్ బెటాలియన్, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.

మరో 700 ఎకరాల్లో ప్రభుత్వ డెయిరీ ఫాం నిర్మించారు. దీంతో మిగిలిన స్థలం చుట్టూ రక్షణగా ఇటీవల ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రహరీ నిర్మించారు. ఇక మిగిలిన దాంట్లో విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి 943.14 ఎకరాల భూమి అవసరం కాగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు అదనంగా 253 ఎకరాల భూమి కావాలని అధికారులు గతంలోనే గుర్తించారు.

ఈ మేరకు గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల శివారులో భూమిని సేకరించేందుకు అప్పట్లోనే సన్నాహాలు చేశారు. కానీ గత బీఆర్ఎస్ సర్కారు దాదాపు పదేళ్ల పాటు నాన్చుతూ రాగా.. ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఫలితంగా మామునూరు ఎయిర్ పోర్టు కాగితాలకే పరిమితం అయింది.

భూమికి భూమే కావాలంటున్న రైతులు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు ఒక అడుగు ముందుకు వేసింది. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు కావాల్సిన భూమిలో నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయం, అసైన్డ్ భూములు, లే అవుట్ ప్లాట్లు, 13 నివాస గృహాలున్నాయి.

దీంతో ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియలో భాగంగా కొద్దిరోజుల కిందట జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, తదితర నేతలు, ఆఫీసర్లతో కలిసి నవంబర్ 7వ తేదీన ఆ మూడు గ్రామాల రైతులు, ప్రజలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమకు భూమికి బదులు భూమి ఇవ్వాల్సిందేనని అక్కడి రైతులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు.

దీంతో భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేస్తామని మంత్రి కొండా సురేఖ, ఇతర నేతలు వారికి హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత భూముకి భూమి ఇవ్వాల్సిన ప్రభుత్వం భూ సేకరణ కోసం నవంబర్ 17న 205 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడి రైతులు గందరగోళంలో పడ్డారు.

'రూ.కోట్లు విలువ చేసే భూమికి రూ.24 లక్షలా...?'

వాస్తవానికి ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు కొంతమంది రైతులు మాత్రమే భూములకు బదులు పరిహారం తీసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. మెజారిటీ రైతులు మాత్రం పరిహారానికి ఒప్పుకోక, వాళ్లంతా భూమికి భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు భూసేకరణను ఫండ్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. కాగా తమ భూములు ఎకరానికి ఐదారు కోట్లు పలుకుతున్నాయని, కానీ ప్రభుత్వ మార్కెట్ వాల్యూ నాలుగైదు లక్షలు మాత్రమే ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు.

ఆ రేటు ప్రకారం ప్రభుత్వం పరిహారాన్ని ఆరు రెట్లు పెంచి ఎకరానికి 24 లక్షల కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదారు కోట్లు పలికే భూమికి 24 లక్షలు ఇస్తామంటే తాము భూములు వదులుకునే ప్రసక్తే లేదని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. గతంలో సెంట్రల్ జైల్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చారని, కనీసం ఆ భూమినైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. .

భూమికి బదులు భూమి ఇవ్వకుంటే తాము సాగు చేసుకుంటున్న ల్యాండ్స్ ను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అలా కాదని బలవంతంగా భూములు తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు ఇన్నాళ్లుగా సవాల్ గా మారిన భూ సమస్యే మళ్లీ తిరగబడినట్లైంది. ఇప్పటికే ఎయిర్ పోర్టు పునరుద్ధరణను పూర్తి చేస్తామని చెప్పుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ భూసేకరణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner