KoushikReddy: నేతల మధ్య మాటల యుద్ధం, కరీంనగర్ కోర్టుకు హాజరైన హుజురాబాద్ MLA కౌశిక్ రెడ్డి
KoushikReddy: బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు రాజకీయ దుమారం రేపుతుంది. కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసులకు భయపడం, ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్‌ఎస్ చెబుతోంది.
KoushikReddy: బీఆర్ఎస్ కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సీఎంపై ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కలెక్టరేట్ లో జరిగిన గొడవకు సంబంధించిన రెండు కేసుల విషయంలో కరీంనగర్ కోర్టుకు కౌశిక్ రెడ్డి హాజరై మీడియాతో మాట్లాడారు.
ప్రజల కోసం పోరాడితే తనపై 28 కేసులు పెట్టారని కరీంనగర్ లో స్పష్టం చేశారు. పీడీ యాక్ట్ అమలు చేయాలనుకుంటే ముందుగా చీటింగ్, ల్యాండ్ కబ్జా లాంటి 82 కేసులున్న సీఎం రేవంత్ రెడ్డి పై పీడి యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసులకు భయపడమని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఈ కార్ రేస్ తో 700 కోట్ల లాభం తెలంగాణ కు వచ్చిందని నెల్సన్ సర్వే తేల్చిందన్నారు. పిచ్చి ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్నాడని మిగతా వారికి తినిపించాలనే లక్ష్యంగా అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు.
నిలదీయండని రేవంత్ రెడ్డి చెప్పారు...
ఒక పార్టీలో గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి వెళ్ళితే నిలదీయండి.. రాళ్ళతో కొట్టండని రేవంత్ రెడ్డే నేర్పించారని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు రాళ్ళతో కొట్టకుండా ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని నీది ఏ పార్టీ అని అడిగానని తెలిపారు.
ముగ్గురు మంత్రులు పది మంది ఎమ్మెల్యేలు నాలుగు జిల్లాల అధికారుల సాక్షిగా సంజయ్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారని చెప్పారు. బిఆర్ఎస్ బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ రెచ్చగొట్టడంతో అసలు నీది ఏ పార్టీ అని అడిగితే సంజయ్ తో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్ ఠాకూర్ దాడి చేశారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బెదిరించారని చెప్పారు. వాళ్లపై ఫిర్యాదు చేస్తే తన పిర్యాదు ను పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వాని విమర్శిస్తే తరిమికొట్టక తప్పదని...
బీఆర్ఎస్ పార్టీ దొంగల ముఠాల తయారై అబద్ధాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేకుంటే తరిమికొట్టక తప్పదని హెచ్చరించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై వీడియో ఆధారాలను చూపించారు.
ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని ఆరోపించిన కౌశిక్ రెడ్డి పై 2013 నుంచే కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు. కెసిఆర్ సీఎంగా ఉన్నప్పుడే కౌశిక్ రెడ్డి పై 15 కేసులు ఉన్నాయని తెలిపారు. టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసులు నమోదు అయితే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి కి ఏం సంబంధమని ప్రశ్నించారు.
దొంగల ముఠా నాయకులు కేసిఆర్, కేటిఆర్, హరీష్ రావు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊర్కోబోమన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని... లంగ మాటలు దొంగ ముచ్చట్లు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే తరిమి కొట్టక తప్పదని హెచ్చరించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)