TG Betting Apps Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ, రీతు చౌదరి.. ఇది రెండోసారి!-vishnupriya and ritu chaudhary appeared for questioning at the panjagutta police station ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Betting Apps Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ, రీతు చౌదరి.. ఇది రెండోసారి!

TG Betting Apps Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ, రీతు చౌదరి.. ఇది రెండోసారి!

TG Betting Apps Case : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. విచారణ ముమ్మరం చేశారు. తాజాగా విష్ణుప్రియ, రీతు చౌదరిని విచారణకు పిలిచారు. మరికొందరు సెలబ్రెటీలకు నోటీసులు ఇచ్చారు. వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రముఖ యాంకర్లు, సినీ నటులు ఉన్నారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియ

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు రీతు చౌదరి, విష్ణుప్రియ. ఇప్పటికే ఈనెల 20న వీరు విచారణకు హాజరయ్యారు. వారం కాకముందే మళ్లీ పోలీసులు వీరిని విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్ నుంచి నిధులు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాల్సిందిగా కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు.

ఒప్పుకున్న రీతు, విష్ణు..

సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు.. రీతు చౌదరి, విష్ణుప్రియను పోలీసులు విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, విష్ణుప్రియ మూడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు చెప్పారు. కానీ.. పోలీసులు మాత్రం 15 యాప్‌లను ప్రమోట్ చేసినట్లు సమాచారం ఉందని చెప్పారు. గత సంవత్సరం బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశానని.. అవి ఇప్పుడు వైరల్ అయ్యాయని రీతు చౌదరి చెప్పారు.

ఒక్కో యాప్‌కు రూ.90 వేలు..

ఈ కేసులో పోలీసులు రీతు చౌదరి, విష్ణుప్రియను విడివిడిగా, తర్వాత కలిపి ప్రశ్నించారు. రీతు చౌదరి, విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారని, ఒక్కో యాప్‌కు దాదాపు రూ.90 వేలు సంపాదించారని తెలిసింది.రీతు చౌదరి తాను చేసిన తప్పును అంగీకరించింది. ఎవరూ బెట్టింగ్ యాప్స్ నమ్మి డబ్బులు మోసపోవద్దని హెచ్చరించింది. ఈ కేసులో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్‌కు చేసుకున్న ఒప్పందాలు, డబ్బులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

19 మందిపై కేసు..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్‌ల యజమానులే లక్ష్యంగా పోలీసుల చర్యలు చేపట్టారు. ఈ కేసులో సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నారు. ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది యూట్యూబ్ స్టార్స్, యాంకర్లు, నటులపై కేసులు నమోదయ్యాయి.

ప్రముఖులపై ఆరోపణలు..

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారని ప్రముఖులపై ఆరోపణలు ఉన్నాయి. వారిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. అటు ప్రభాస్, గోపిచంద్, బాలకృష్ణపై ఇప్పటికే పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓటీటీ వేదికగా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారని ఆరోపించారు.

మరో యువకుడు బలి..

బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని సోమేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌడవెల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్.. క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. మనోవేదనతో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.