Caste Discrimination : 'మీరు బోనం పెట్టొద్దు'...! దళితులను గుడిలోకి రాకుండా అడ్డగింత, సిద్ధిపేట జిల్లాలో ఘటన
సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వెళ్లగా… ఇతర కులస్తులు నిరాకరించి అడ్డుకున్నారు. ఈ ఘటన మర్కుక్ మండలంలోని శివారు వెంకటాపూర్‌లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పలు బహుజన సంఘాల నాయకులు.. దళిత కుటుంబాలకు మద్దతు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో కులవివక్ష బుసలు కొట్టింది. మీరు తక్కువ జాతికి చెందినవారని… గుడిలో రావొద్దని అడ్డుకున్న సంఘటన జిల్లాలోని మర్కూక్ మండలంలోని శివారు వెంకటాపూర్ గ్రామంలో జరిగింది.
శివారు వెంకటపూర్ గ్రామంలో ఇటీవల దుర్గమ్మ టెంపుల్ నిర్మించారు. గ్రామం మొత్తం నాలుగు రోజులు ఉత్సవాలు జరపాలని గ్రామా కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా… గ్రామంలోని బొడ్రాయికి, మైసమ్మ, దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. అయితే గ్రామంలో 30 దళిత కుటుంబాలు కూడా ఈ సంబరాల్లో మొదటి నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బొడ్రాయి దగ్గర జరిగిన పూజల్లో, మైసమ్మ పండుగలో దళితులు పాల్గొన్నారు. అయితే కొత్తగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలోకి రావొద్దని కొంత మంది వీరిని అడ్డుకున్నారు.
మీరు బోనం పెట్టొద్దు.......!
దుర్గమ్మకు గ్రామస్తులందరూ బోనం అర్పిస్తుండగా… దళిత కుటుంబాల మహిళలు కూడా బోనం అర్పించడానికి వెళ్లారు, అయితే వారంతా తక్కువ కులానికి చెందిన వారని, గుడిలోకి రావొద్దని అడ్డుకున్నారు. ఈ ఘటనపై దళిత యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను హేళన చేసి మాట్లాడారని, అంటరానివారంటూ మాటలు మాట్లాడారని చెప్పారు. ఎదురుమాట్లాడిన తమపై దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గ్రామంలో పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో దళిత కుటంబాలు మర్కూక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
దళిత సంఘాల మద్దతు......
విషయం తెలిసిన దళిత బహుజన సంఘాల నాయకులు శివారు వెంకటాపూర్ గ్రామానికి వచ్చి దళిత కుటుంబాలకు మద్దతు ప్రకటించారు. ఈ సంఘటన తీవ్ర అమానుషమన్నారు. దళితుల ఆత్మగౌరవంపై దెబ్బకొడితే సహించేది లేదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ హెచ్చరించారు. పలువురు నేతలతో కలిసి గ్రామంలో సమావేశమైన వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం దళితవాడలో ఉన్న ఎల్లమ్మ,మాతమ్మ గుడిలో కొబ్బరి కాయలు కొట్టారు. అక్కడ్నుంచి మర్కుక్ పొలీసు స్టేషన్ కు చేరుకున్నారు. దళితులను అవమానపర్చిన నిందితులను అరెస్టు చేయాలని ధర్నాకు దిగారు. సీఐ మహెందర్ రెడ్డి, ఎస్.ఐ దామొదర్… వారితో చర్చలు జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ… ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, పొలీసు కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశాలివ్వాలని కోరారు. దళితులకు అలయ ప్రవేశం కల్పించి వారి హక్కులను కాపాడాలన్నారు. దళితులను అవమాన పర్చిన వారిని అరెస్ట్ చేయాలన్నారు.