Temple for Hindu Priest: పూజలు అందుకునే పూజారి.. జనగామ జిల్లాలో అర్చకుడికి ఆలయం
Temple for Hindu Priest: తనువు చాలించేంత వరకు సీతా రాముల సేవలో తరించిన ఓ అర్చకుడికి గ్రామస్తులు ఏకంగా గుడి కట్టి పూజిస్తున్నారు.
Temple for Hindu Priest: సాధారణంగా దేవుళ్లకు కట్టిన గుళ్లలో జనాలు పూజలు చేస్తుంటారు. అర్చకుడి ద్వారా దేవతామూర్తులకు పూజా ప్రసాదాలను సమర్పించి కొలుస్తుంటారు. ఇందులో అర్చకుల పాత్రకేవలం వేదమంత్రోచ్ఛరణలు, పూజాప్రసాదాల నివేదనకు మాత్రమే పరిమితమవుతుంది.
కానీ తనువు చాలించేంత వరకు సీతారాముల సేవలో తరించిన ఓ అర్చకుడు మాత్రం ఇక్కడ దేవుడిలా పూజలందుకుంటున్నారు. ప్రజలకు అర్చకుడిలానే కాకుండా వైద్యుడిగా సేవలందించిన ఆయన చనిపోగా.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులంతా కలిసి అర్చకుడికి ఏకంగా గుడి కట్టి కొలుస్తున్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామంలో ఈ ఘటన జరగగా.. ఇటీవలే ఆ ఆలయానికి ప్రారంభోత్సవం నిర్వహించారు. అర్చకుడికి గుడి కట్టిన సందర్భం దేశంలో ఎక్కడా లేదని, ఆ ఘనత తమ గ్రామానికే దక్కిందని ఇక్కడి ప్రజలు గర్వంగా చెబుతుండటం గమనార్హం.
అర్చకుడిగా, వైద్యుడిగా కీర్తి
తాటికొండ గ్రామానికి చెందిన సౌమిత్రి రంగాచార్యులు(68).. తన తండ్రి మరణం తర్వాత 14 ఏళ్ల వయసు నుంచి గ్రామంలోని సీతారాముల గుడిలో పూజలు చేయడం ప్రారంభించారు. అంతేగాకుండా ఆయుర్వేద వైద్యం తెలిసిన ఆయన గ్రామస్తులకు ఏ కష్టమొచ్చినా సేవ చేసేవారు. ఆయన వైద్యంతో చాలామంది రోగాలు నయమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
రంగాచార్యులు ప్రజల కష్టసుఖాల్లోనూ పాలుపంచుకుంటూ అందరికి ఆప్తుడిగా మెదిలేవారు. దీంతో గ్రామస్థులు కూడా ఆయనను అర్చకుడిగానే కాకుండా తమ ఇంట్లో వ్యక్తిగా అభిమానించేవారు. ఇదిలాఉంటే కొన్నేళ్ల కిందట రంగాచార్యుల కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ కాగా .. గ్రామంలోని రాముడికి పూజలు కరువయ్యాయి.
గ్రామంలోకూడా తరచూ ఏదో ఒక కీడు జరిగేది. దీంతో గ్రామస్థులు కొందరు ఆయన వద్దకు వెళ్లి ప్రాథేయపడటంతో రంగాచార్యులు కుటుంబం తిరిగి గ్రామానికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఆయన గ్రామంలో అడుగు పెట్టిన తరువాత గ్రామంలో అన్నీ శుభాలే జరిగినట్లు పేర్కొంటున్నారు. కొందరైతే బోధి ధర్మతో పోలుస్తుండటం గమనార్హం.
సీతారాముల కల్యాణం ఆయన చేతుల్లోనే
చిన్నతనంలోనే పురోహిత్యాన్ని పుణికిపుచ్చుకున్న రంగాచార్యులు దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా అర్చకుడిగా సీతారాములను కొలిచారు. ఏటా సీతారాముల కల్యాణమహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. ఆయన చేతులమీదుగానే సీతారాముల విగ్రహాలను తీసుకొచ్చి మరీ కల్యాణఘట్టాన్ని పూర్తి చేసేవారు. అందుకే రంగాచార్యులను మరో రామదాసుగా అందరూ భావించేవారు.
నిత్యం రామారాధన చేసే ఆయన ఆయన కొడుకులకు రామలక్ష్మణపేర్లే పెట్టారు. పెద్ద కొడుకు రామాచార్యులు, చిన్నకుమారుడికి లక్ష్మణాచార్యులుగా పేర్లు పెట్టారు. రామభక్తిలో తరించిపోయిన ఆయన గతేడాది జనవరిలో కనుమూశారు.
దీంతో రంగాచార్యులు కుటుంబ సభ్యులు గ్రామస్థుల విజ్ఞప్తి, సహకారంతో గ్రామంలో రూ.6 లక్షల ఖర్చుతో విగ్రహం ఏర్పాటు చేసి, గుడి కట్టించారు. ఏటా సీతారాముల కల్యాణాన్ని రంగాచార్యులు వైభవోపేతంగా, సంబరంగా నిర్వహించేవారు కావడంతో.. సీతారాముల విగ్రహాలను కల్యాణఘట్టానికి తీసుకెళ్తున్నట్టుగానే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ గుడి ప్రారంభోత్సవాన్ని గురువారం నిర్వహించగా.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి పూజలు చేయడం విశేషం.
(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)