Attack On Vikarabad Collector : వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత- కలెక్టర్ పై చేయి చేసుకున్న మహిళ, వాహనాలు ధ్వంసం
Vikarabad Collector Car Attacked :వికారాబాద్ జిల్లా లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా విలేజ్ భూసేకరణపై చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్, ఆధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు.
వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. దుద్యాల మండలం లగచర్లలో స్థానికులు కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఫార్మా విలేజ్ భూసేకరణపై చర్చించేందుకు కలెక్టర్, తహసీల్దార్ లగచర్ల గ్రామానికి వెళ్లారు. ఫార్మా విలేజ్ వద్దంటూ..కలెక్టర్ గో బ్యాక్ అంటూ రైతులు, స్థానికులు ఆందోళనలు చేపట్టారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజలను వారించేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా కలెక్టర్ వైపు దూసుకొచ్చిన గ్రామస్థులు.. ఆయనపై దాడికి పాల్పడ్డారు. కలెక్టర్ కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్తుండగా పలువురు రాళ్లతో కార్లపై దాడి చేశారు. కలెక్టర్ కారు అద్దాలు ధ్వంసం చేశారు.
అయితే అంతకు ముందు గ్రామానికి 2 కి.మీ. దూరంలో అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామస్థుల తరఫున ఓ వ్యక్తి కలెక్టర్ వద్దకు వచ్చి గ్రామంలో సభ ఏర్పాటుచేశాయని చెప్పాడు. దీంతో కలెక్టర్, అధికారులు గ్రామానికి వెళ్లగా...గ్రామస్థులు కలెక్టర్ ను అడ్డుకుని వారి వాహనాలపై రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో పలువురు అధికారులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో పోలీసులను మోహరించారు.
కాడా అధికారిపై దాడి
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్ పై దాడి జరిగింది. కలెక్టర్, అధికారులపై రాళ్లు, కర్రలతో రైతులు, గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి చేసుకున్నట్లు సమాచారం. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థుల దాడి చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్థుల అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లతో రైతుల దాడి చేశారు. మూడు వాహనాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు కలెక్టర్, అధికారులు వచ్చారు.
కలెక్టర్ కు సీఎస్ ఫోన్
దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. దాడి అనంతరం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు ఆఫీసులో అధికారులతో మాట్లాడారు. దాడి ఘటనపై వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో సీఎస్ శాంతికుమారి ఫోన్ లో మాట్లాడారు. దుద్యాలలో జరిగిన దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడ్డారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకర్గమైన కొడంగల్ లో కలెక్టర్ పై దాడి చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ ఒంటెద్దు పోకడలు, నియంత విధివిధానాలు నచ్చక కలెక్టర్ పై, ప్రభుత్వాధికారులపై కర్రలతో, రాళ్లతో దాడి చేసి.. మూడు ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారని బీజేపీ, బీఆర్ఎస్ ఎక్స్ లో వీడియోలు పోస్టు చేశాయి.
సంబంధిత కథనం