Lagacherla Remand Report : లగచర్ల ఘటన వెనుక కుట్రకోణం-రిమాండ్ రిపోర్టులో సంచలనాలు-vikarabad lagacherla incident remand report sensational things conspiracy behind attack ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Lagacherla Remand Report : లగచర్ల ఘటన వెనుక కుట్రకోణం-రిమాండ్ రిపోర్టులో సంచలనాలు

Lagacherla Remand Report : లగచర్ల ఘటన వెనుక కుట్రకోణం-రిమాండ్ రిపోర్టులో సంచలనాలు

Bandaru Satyaprasad HT Telugu
Nov 13, 2024 02:30 PM IST

Lagacherla Remand Report : వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. దాడి వెనుక కుట్రకోణం ఉందని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారమే అధికారులను గ్రామానికి రప్పించి దాడి చేశారన్నారు. ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

లగచర్ల ఘటన వెనుక కుట్రకోణం-రిమాండ్ రిపోర్టులో సంచలనాలు
లగచర్ల ఘటన వెనుక కుట్రకోణం-రిమాండ్ రిపోర్టులో సంచలనాలు

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించి మొత్తం 46 మందిని నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా భోగమోని సురేష్ ను పేర్కొన్నారు.

అసలేం జరిగింది?

ఈ నెల 11న లగచర్లలో ఫార్మా విలీజ్ భూసేకరణపై చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా పలువురి అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో అధికారులపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. అదనపు కలెక్టర్‌ లింగయ్య నాయక్‌, కడా అధికారి వెంకట్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు...దాడికి పాల్పడిన వారిని గుర్తించారు.

లగచర్ల రాళ్ల దాడిలో కలెక్టర్‌, అధికారులు, పోలీసులకు గాయాలయ్యాయని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఫార్మా విలీజ్ పై అభిప్రాయ సేకరణ కోసం ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు అదనపు కలెక్టర్‌ లింగయ్య, తాండూరు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌ ఉమాశంకర్‌, తహసీల్దార్ కిషన్‌ నాయక్‌, విజయ్‌కుమార్‌, కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి లగచర్లకు వచ్చారు. లగచర్ల గ్రామ శివార్లలో.. గ్రామ సభ ఏర్పాటు చేశారు. అయితే సురేష్ అనే వ్యక్తి గ్రామస్థుల తరఫున వచ్చాయని కలెక్టర్‌ సహా ఇతర అధికారులతో మాట్లాడారు. గ్రామ శివారులో సభ పెట్టారని, గ్రామస్థుల ఊరిలో ఉన్నాయని అక్కడికి వచ్చి మాట్లాడాలని కలెక్టర్ , అధికారులను తీసుకెళ్లాడు.

కుట్రకోణం

నిందితులపై హత్యాయత్నంతో మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద కేసులలో నమోదు చేశారు. దాడి వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు పేర్కొన్నారు. పక్క పథకం ప్రకారమే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడులు చేసి విధ్వంసం సృష్టించాలని కుట్రపన్నార్నారు. కుట్రలో భాగంగానే వికారాబాద్‌లో కాకుండా లగచర్లకి వచ్చి రైతులతో మాట్లాడాలని అధికారులను ఒప్పించారన్నారు. ఇందులో భాగంగానే లగచర్ల నుంచి సురేష్‌ను వికారాబాద్‌కు పంపించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

కలెక్టర్‌ వెళ్లిన సమయంలో గ్రామస్థుల్లోని కొందరు కలెక్టర్, అధికారులను ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేశారు. కలెక్టర్ వాహనంలో వెళ్లిపోతుంటే... ఆ వాహనాన్ని అడ్డగించి రాళ్ల దాడి చేశారు. అధికారుల వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి ఘటనపై వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మరాజుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ ను ఏ 1గా పోలీసులు చేర్చారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దాడికి పాల్పడిన 30 మంది అసలు నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ సత్యనారాయణ సమగ్ర విచారణ చేపట్టారు.

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, రెవిన్యూ అధికారులపై జరిగిన దాడి వెనుక కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సురేష్ ఘటన జరిగిన సమయంలో ఆయనతో నిరంతరం సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కేబీఆర్‌ పార్క్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి గ్రామస్థుల్ని రెచ్చగొట్టారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్‌ డేటా, సంభాషణలపై దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సురేష్‌తో మాట్లాడినట్టు గుర్తించారు. కలెక్టర్‌పై దాడి యత్నం కేసులో భాగంగా అరెస్ట్ చేసి వికారాబాద్ తరలించారు.

Whats_app_banner

సంబంధిత కథనం