Enquiry On KU VCs: కేయూ మాజీ వీసీలకు విజిలెన్స్ బెడద, గతంలో మాజీ వీసీ రమేష్.. తాజాగా వెంకటరత్నంకు నోటీసులు-vigilance is a problem for former ku vcs former vc ramesh latest notices to venkataratnam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Enquiry On Ku Vcs: కేయూ మాజీ వీసీలకు విజిలెన్స్ బెడద, గతంలో మాజీ వీసీ రమేష్.. తాజాగా వెంకటరత్నంకు నోటీసులు

Enquiry On KU VCs: కేయూ మాజీ వీసీలకు విజిలెన్స్ బెడద, గతంలో మాజీ వీసీ రమేష్.. తాజాగా వెంకటరత్నంకు నోటీసులు

HT Telugu Desk HT Telugu
Aug 16, 2024 12:19 PM IST

Enquiry On KU VCs: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీలకు విజిలెన్స్ బెడద పట్టుకుంది. ఇప్పటికే వీసీగా పని చేసి ఆ పదవి నుంచి తప్పుకున్న ప్రొఫెసర్ రమేష్ పై విజిలెన్స్ విచారణ జరుగుతుండగా, దాదాపు 11 ఏళ్ల కిందట జరిగిన వ్యవహారంలో మాజీ వీసీ వెంకట రత్నంకు విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

కాకతీయ యూనివర్శిటీ
కాకతీయ యూనివర్శిటీ

Enquiry On KU VCs: కాకతీయ వర్శిటీ వీసీలను విజిలెన్స్ వెంటాడుతోంది. 2013లో కాకతీయ యూనివర్సిటీలో కొంతమంది ఉద్యోగులను ప్రభుత్వ అనుమతి లేకుండానే రెగ్యులర్ చేశారన్న ఆరోపణల మేరకు ఫిర్యాదులు అందగా.. వరంగల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మాసీ వీసీ వెంకటరత్నంకు నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

అంతేగాకుండా ఆయనపై అందిన ఫిర్యాదుకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, దాంతో పాటు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర డాక్యుమెంట్స్ తో విచారణకు హాజరు కావాల్సిందిగా.. నోటీసుల్లో ఆదేశించారు. కాగా వెంకటరత్నం వీసీగా పని చేసిన సమయంలో దాదాపు 37 మంది మినిమం టైమ్ స్కేల్ ఎంప్లాయిస్ ను ప్రభుత్వ అనుమతి లేకుండా, నిబంధలనకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై గతంలోనే వివాదం మొదలైంది. పలుమార్లు ఈసీ మీటింగ్ ల్లోనూ చర్చ జరిగింది. 2019 లో ఆ నియామకాలు చెల్లవంటూ ఈసీ తీర్మానం చేయగా.. వాళ్లంతా కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది.

కొద్దిరోజుల కిందట మాజీ వీసీ రమేష్ పై..

ఈ ఏడాది మే 18న కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేషం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీకి ఆదేశాలు జారీ చేశారు.

కేయూ వీసీగా నియామకం అయినప్పటి నుంచి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ చేసిన అక్రమాలపై ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) పలుమార్లు ఫిర్యాదు చేయగా, స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేపట్టేందుకు విజిలెన్స్ కు ఆర్డర్స్ ఇచ్చింది. వీసీగా పోస్టింగ్ కు ప్రొఫెసర్ గా పదేళ్ల అనుభవం అవసరం అయినప్పటికీ తనకున్న పరిచయాలతో వైస్ ఛాన్స్ లర్ గా ప్రొఫెసర్ రమేష్ అక్రమంగా పోస్టింగ్ తెచ్చుకున్నారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తాయి.

దీంతో కొంతమంది కోర్టుకు వెళ్లగా.. ఆ కేసు ఇంకా నడుస్తోంది. అంతేగాకుండా వీసీ రమేశ్ రూల్స్ కు విరుద్ధంగా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పొందారనే ఆరోపణలున్నాయి. అంతేగాకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే 16 మందిని అనుబంధ అధ్యాపకులుగా నియమించడంపైనా వివాదం ఏర్పడింది. దాంతో పాటు యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు వీసీ రమేష్ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారని, యూనివర్సిటీకి సంబంధించిన పనుల విషయంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అధికారులకు కక్కుర్తి పడినట్లు ఆరోపణలున్నాయి.

ముఖ్యంగా పీహెచ్‌డి సీట్లను అనర్హులకు కట్టబెట్టి అక్రమంగా సంపాదించారనే ఆరోపణలతో పాటు వర్సిటీ భూములు ఆక్రమించిన వారికి సపోర్ట్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతోనే వీసీ రమేష్ పదవీకాలం ముగిసే సమయంలోనే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

రెండు రోజుల కిందట రిజిస్ట్రార్ పై..

కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొ.మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ గా నియామకంపై విచారణ జరపాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నుంచి కేయూ ఇన్ఛార్జ్ వీసీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సరైన అనుభవం లేకున్నా.. అప్పటి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మల్లారెడ్డికి అసోసియేట్ ప్రొఫెసర్ గా నియమించారంటూ హనుమకొండకు చెందిన కేఎన్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు 15 రోజుల కిందట చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి వెంటనే నివేదిక పంపాల్సిందిగా ప్రస్తుత ఇన్ఛార్జ్ వీసీకి ఉత్తర్వులు (నెం.1457/UE/A2/2024) జారీ చేశారు. ఇలా వర్సిటీ ఉన్నతాధికారులపై వరుసగా విచారణలు జరుగుతుండటంతో కేయూలో గందరగోళ వాతావరణం కనిపిస్తోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ ప్రతినిధి)