కొత్త రేషన్‌ కార్డులకు మోక్షం.. ఆన్‌లైన్‌ దరఖాస్తులపై విచారణ.. హైదరాబాద్ నగరంలో ఇదీ పరిస్థితి-verification ongoing on online applications for new ration cards in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కొత్త రేషన్‌ కార్డులకు మోక్షం.. ఆన్‌లైన్‌ దరఖాస్తులపై విచారణ.. హైదరాబాద్ నగరంలో ఇదీ పరిస్థితి

కొత్త రేషన్‌ కార్డులకు మోక్షం.. ఆన్‌లైన్‌ దరఖాస్తులపై విచారణ.. హైదరాబాద్ నగరంలో ఇదీ పరిస్థితి

కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయక.. దాదాపు పదేళ్లు అయ్యింది. దీంతో లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. ప్రాథమిక పరిశీలనలో కొన్నింటిని తిరస్కరించారు. ప్రస్తుతం దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు మోక్షం కలగనుంది.

కొత్త రేషన్ కార్డులు

హైదరాబాద్ నగరంలో రేషన్‌ కార్డులకు మోక్షం కలగనుంది. మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన అప్లికేషన్లపై క్షేత్ర స్థాయి విచారణ చేస్తున్నారు అధికారులు. అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తున్నారు. సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ ఇప్పటికే విచారణ పూర్తి చేసి.. కొందరికి కార్డులు మంజూరు చేసింది. ఇంకా కొందరికి తిరస్కరించింది. పెండింగ్ దరఖాస్తులపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

కొత్త కార్డులకు రేషన్ కోటా..

ఈ నెల 24వ తేదీ వరకు మంజూరైన కొత్త కార్డులకు రేషన్‌ కోటాను అధికారులు కేటాయించారు. దశలవారీగా విచారణ చేస్తూ.. రేషన్‌ కార్డులు మంజూరు చేస్తున్నట్లు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సుమారు 2 లక్షల కుటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు.. అధికారులు చెబుతున్నారు.

83 వేల మంది అర్హులు..

ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వారు రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా ప్రజా పాలనలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం సమగ్ర సర్వే ద్వారా గ్రేటర్‌లో మొత్తం 22 లక్షల కుటుంబాల వివరాలు సేకరించింది. మెజారిటీ దరఖాస్తుల్లో తమకు రేషన్‌కార్డు లేదని, కొత్త రేషన్‌ కార్డు కావాలని ప్రజలు కోరారు. అవన్నీ పరిశీలించిన తర్వాత అర్హుల లెక్క 83వేల 285గా తేలింది.

వివిధ కారణాలతో పెండింగ్..

అర్హుల లెక్కపై స్పష్టత ఉన్నా.. ఎన్నికల కోడ్‌ ఇతరత్రా కారణాలతో అది పెండింగ్‌లో పడిపోయింది. గత నెలలో ఆన్‌లైన్‌ ద్వారా కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. దీంతో పేద కుటుంబాలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నాయి. వాటిని పరిశీలిస్తూ.. కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు. ఇటు జిల్లాల్లోనూ దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోంది.

ఒకేసారి మూడు నెలల బియ్యం..

మరోవైపు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా.. మూడు నెలల రేషన్ ఒకే సారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. దీంతో జిల్లాల సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యం పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని డీలర్లు చెబుతున్నారు.

సంబంధిత కథనం