Ponnam Prabhakar: కరీంనగర్ లో వేంకటేశ్వర స్వామి శోభాయాత్ర... కోలాటం ఆడిన రవాణా శాఖ మంత్రి పొన్నం
Ponnam Prabhakar: కరీంనగర్ లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి. వారం రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలో నేత్రపర్వంగా శోభ యాత్ర నిర్వహించారు.

Ponnam Prabhakar: కరీంనగర్‌లో జరిగిన వేంకటేశ్వర స్వామి శోభాయాత్రలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కోలాటం ఆడి చూపరులను కనువిందు చేశారు.
కరీంనగర్ లోని ప్రధాన కూరగాయల మార్కెట్ లో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా జరిగాయి. ఈనెల మూడు నుంచి పదో తారీఖు వరకు వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పద్మనగర్ నుండి మార్కెట్ రోడ్ లో గల వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు.
శోభ యాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దారి పొడవున భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో అలంకరించిన రథంపై ఆ దేవదేవుడిని అలంకరించి నిర్వహించిన శోభాయాత్రలో గజరాజు, గుర్రాలు, కళాకారుల డప్పు నృత్యాలు, మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కోలాటం ఆడిన మంత్రి పొన్నం...
శోభాయాత్రలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గజరాజ ఆశిర్వాదం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం కోలాటం ఆడి ఆడారు. డప్పు కళాకారులతో కలిసి దరువేసి చూపరులను ఆకట్టుకున్నారు.
టీటీడీ ఫ్రీ లడ్డూ ప్రసాదం..
వారం రోజులపాటు కన్నుల పండువలా జరిగిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం అందజేశారు. గత ఏడు సంవత్సరాలుగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాజకీయాలకతీతంగా నగర ప్రజలు నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు సాగింది శోభయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వచ్చే ఏడాదికి ఇదే పద్ధతిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా ప్రజలందరిని చల్లంగా చూడాలని భగవంతుడిని వేడుకున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)