Vemulawada: భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయం చాళుక్యుల కాలంనాటి మహోన్నత శిల్పకళకు నిలువెత్తు సాక్ష్యం. క్రీ.పూ. 750 ప్రాంతంలో చాళుక్యులు నిర్మించిన వేములవాడ ఆలయం శతాబ్దాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది.
చాళుక్యులు వారి సామ్రాజ్యాన్ని వేములవాడ కేంద్రంగా పాలించారని శాసనాలు చెబుతున్నాయి.ౠ ఆనాటి శిల్పకళ, నిర్మాణశైలి ఈ ఆలయ గోపురాలపై స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి ఆలయాన్ని పునఃర్నిర్మించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.
శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ఏడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.47 కోట్లు మంజూరు చేయడంతోపాటు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు.
పనులు వేగవంతం చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు మంగళవారం పర్యటించి విస్తరణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. ఈనెల 16న హైదరాబాద్ లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, 17న శృంగేరి పీకాధిపతుల అనుమతుల కోసం వెళ్తారు. వారి సూచనలతో భక్తిభావం విరాజిల్లేలా పనులు చేపట్టనున్నారు. జూన్ 15న పనులు చేపట్టాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఆలయ విస్తరణ పనులు చేపడితే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కొనసాగించనున్నారు.
వేములవాడ రాజన్న ఆలయం సంప్రదాయానికి, శిల్పకళకు సౌందర్యానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకోనుంది. పుష్కరిణి మధ్యలో శివుడి విగ్రహం, నీటి ప్రవాహాల మధ్య మెరిసే మహాదేవుడి మూర్తి భక్తులకు ఆపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. పుష్కరిణి చుట్టూ పార్క్, నడక మార్గాలు, సాధారణ యాత్రను విశిష్ట యాత్రగా మార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీని కోసం తయారు చేసిన డిజైన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఆలయ పునరుద్ధరణలో భాగంగా 1979లో భారీ స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ గర్భగుడి నుంచి ద్వారాలు, రాజగోపురాలను ఆదునిక శైలిలో మరమ్మతులు చేసి, ఆలయ సంప్రదాయ నిర్మాణ ఆధారంగా అదునీకీకరించారు. ధర్మ పుష్కరిణి, ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆలయాలు కోటిలింగాలు ఆన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
1979లో మొదలైన పునరుద్ధరణదశ ఆలయాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఆలయ విస్తరణ పనులు చేపడితే భవిష్యత్ ఉండగా.. ఇప్పుడు జరుగుతున్న విస్తరణ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఉంటుంది. ఆలయ పురాతన శిల్పకళ, శైవ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరించనున్నారు.
వేములవాడ రాజన్న గుడిని వెయ్యేళ్ళకు.. సరిపడేలా సుందరంగా, భక్తులకు అన్ని వసతులు, సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాజన్న గుడికి రావడంతోనే ఆలయం, పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లైందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పాలకులు కేవలం బ్రోచర్లతోనే భక్తులను మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
వేములవాడలో శివుడే ప్రధాన దైవమైనా, లక్ష్మీగణపతి, అమ్మవారు మూలవిరాట్ గా కొలువై ఉన్నారు. ఆలయ ఆవరణలోనే అనంతపద్మనాభస్వామి, సీతారామచంద్రస్వామి ఆలయాలు ఉండటంతో హరిహరక్షేత్రంగా పేరుగాంచింది. ఆలయంలోనే దర్గా ఉండటంతో మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆలయానికి వచ్చే హిందువులు దర్గాను దర్శించుకుంటే.. ముస్లింలు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ నిత్యం కనిపిస్తుంటాయి. భీమేశ్వరాలయం పురాతన శిల్పకళకు ప్రతీక బద్దిపోచమ్మ అమ్మవారికి భక్తులు బోనం మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు రాజన్న దర్శనార్థం వేములవాడకు తరలివస్తారు. మహాశివరాత్రి, శివకల్యాణోత్సవం, శ్రీరామనవమి ఉత్సవాలతోపాటు శ్రావణమాసం, కార్తీకమాసం, ఉగాది వంటి పర్వదినాల్లో ఈ సంఖ్య లక్షల్లో చేరుతుంది. భక్తులు ఆలయంలోని ధర్మ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని తడిబట్టలతో మహాశివరాత్రి, దర్శించుకుంటారు. తలనీలాలు, కోడె మొక్కులు చెల్లించుకుంటారు.
కొడుకు నివ్వు రాజన్న, కోడెను గడుతాం రాజన్నా అంటూ భక్తులు నమ్మకంతో పెద్దసంఖ్యలో చేరుకుంటారు. అలాంటి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో పాటు శృంగేరి పీఠాధిపతి ప్రయత్నిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మంచి ముహుర్తంలో పనులు ప్రారంభించి సకాలంల పూర్తి చేసే పనిలో అధికారులు పాలకులు నిమగ్నమయ్యారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం