రెండేళ్ల పాటు రాజన్న ఆలయ మూసివేత ప్రచారం, రేపు వేములవాడ బంద్-vemulawada temple closure rumors spark protest bandh called for tomorrow ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రెండేళ్ల పాటు రాజన్న ఆలయ మూసివేత ప్రచారం, రేపు వేములవాడ బంద్

రెండేళ్ల పాటు రాజన్న ఆలయ మూసివేత ప్రచారం, రేపు వేములవాడ బంద్

ఆలయ అభివృద్ధి పేరిట వేములవాడ రాజన్న ఆలయాన్ని రెండేళ్ల పాటు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం సరికాదని..రాజన్న ఆలయ రక్షక కమిటీ అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రేపు వేములవాడ పట్టణం బంద్ కు పిలుపునిచ్చాయి.

రెండేళ్ల పాటు రాజన్న ఆలయ మూసివేత ప్రచారం, రేపు వేములవాడ బంద్

వేములవాడ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి పేరుతో జూన్ 15 నుండి రాజన్న ఆలయాన్ని మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు(బుధవారం) వేములవాడ పట్టణ బంద్ కు రాజన్న ఆలయ రక్షక కమిటీ పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తమ దుకాణాలను మూసివేయాలని కోరింది.

ఆలయ రక్షక కమిటీ నిరసన

బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామక్రిష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల నాయకులతో కలిసి ‘రాజన్న ఆలయ రక్షక కమిటీ’ని ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాబోయే రెండు సంవత్సరాలపాటు ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజన్న ఆలయ రక్షక కమిటీ నిరసనకు పిలుపునిచ్చింది.

రెండేళ్ల పాటు ఆలయం మూసివేత దుర్మార్గం

కమిటీ ఛైర్మన్ ప్రతాప రామక్రిష్ణ మాట్లాడుతూ....ఆలయ అభివృద్ధి పేరుతో 2 ఏళ్లపాటు రాజన్న ఆలయాన్ని మూసివేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పేరుతో పరివార్ దేవతామూర్తుల (హిందూ) విగ్రహాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

వేములవాడ బంద్ కు సహకరించాలి

రాజన్న ఆలయం వద్దనున్న దర్గాను తొలగించాలని రాజన్న భక్తులంతా ముక్త కంఠంతో కోరుతున్నా పట్టించుకోని అధికారులు ఆలయాన్ని మూసివేయాలనుకోవడం విడ్డూరమన్నారు. సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ రేపు చేపట్టబోయే వేములవాడ బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వ్యాపారులంతా స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేయాలని పిలుపునిచ్చారు.

ఈవో క్లారిటీ

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం జూన్ 15 నుంచి మూసివేస్తున్నట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆలయ ఈవో కె.వినోద్ అన్నారు. ఆలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలు, భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

ఆలయం మూసివేత వదంతులు నమ్మొద్దు

రాజన్న ఆలయం మూసివేస్తున్నట్లు వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని, ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని అన్నారు.

శృంగేరి పీఠాధిపతి అనుమతులు, దేవాదాయ ధర్మదాయ శాఖ సలహాలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆలయాన్ని సుందరింగా తీర్చి దిద్దుతామన్నారు.

రాజన్న ఆలయ నిర్మాణ పనులు, విధి విధానాలు, పూర్తి అంశాలను తదుపరి సమావేశంలో వెల్లడిస్తామని ఈవో తెలిపారు. ఇప్పటివరకు భక్తులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, వదంతులను నమ్మవద్దని కోరారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం