Sri Raja Rajeshwara Swamy : వేములవాడ ఆలయానికి కార్తీక శోభ, నెల రోజుల పాటు ప్రతి సాయంత్రం దీపారాధన
Vemulawada Sri Raja Rajeshwara Swamy : వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. నేటి నుంచి నెల రోజుల పాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం, మహా లింగార్చన నిర్వహిస్తారు.
దక్షిణ కాశీగా పేరుంది హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. నేటి నుంచి నెల రోజులపాటు కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంత్రం దీపారాధన, సోమవారం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన, నిర్వహిస్తారు. శివ కేశవులు కొలువైన రాజన్న సన్నిధిలో ప్రతి సోమవారం పరమపవిత్రమైన దినంగా భావిస్తారు.
తెలంగాణలో హరిహర క్షేత్రంగా కోరిన కోర్కెలు తీర్చే కోడెమొక్కుల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధి కార్తీక మాసంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేటి నుంచి ప్రారంభమైన కార్తీక మాసంలో నెల రోజులపాటు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహా లింగార్చన, మూడో సోమవారం భీమేశ్వరాలయంలో మహాలింగార్చన, పరివార దేవదార్చనలు జరుగుతాయి.
కార్తీక శుద్ధ చతుర్దశి రోజున శ్రీ స్వామివారికి, అనుబంధ ఆలయాల్లో అన్న పూజలు, సాయంత్రం భీమేశ్వర స్వామి వారికి ప్రదోష పూజ, పౌర్ణమి రోజున రాత్రి జ్వాలతోరణం, మహాపూజను ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నిర్వహిస్తారు. కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం దేవాలయ ఆవరణలో దీపారాధన ఏర్పాటు చేశారు. పరమ పవిత్ర మాసంగా కార్తీక మాసాన్ని భావిస్తు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెలరోజుల పాటు అందులో సోమవారం భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.
సోమవారం ప్రత్యేకంగా
వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సోమవారం భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, మహాలింగార్చన దీపారాధన ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల కోసం ఆర్టీసీ సోమవారం ప్రత్యేక బస్సులను నడపనుంది. కరీంనగర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంటుంది. సిరిసిల్ల సమీపంలో ఉండే వేములవాడ కు కరీంనగర్ హైదరాబాద్ నుంచి బస్సు సౌకర్యం ఉంది.
ధర్మపురి వద్ద గోదావరి మహా హారతి
నవనారిసింహ క్ష్రేతాల్లో ఒకటైన ధర్మపురి క్షేత్రంలో కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు ధర్మపురి వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం ప్రారంభం సంధర్బంగా ధర్మపురిలో నేటి నుంచి నెలరోజుల పాటు గోదావరినదీ తీరంలో మహాహారతి ఏర్పాటు చేశారు. ఇదివరకు కార్తీక పౌర్ణమి నుంచి 15 రోజులు మహా హారతి నిర్వహించగా ఈసారి ప్రత్యేకంగా కార్తీకమాసం ప్రారంభమైన రోజు నుంచి నెలరోజుల పాటు నిత్యం గోదావరిలో మహాహారతి నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. గోదావరికి మహా హారతి తో పాటు నెల రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
కార్తీక పౌర్ణమి రోజున పంచసహస్ర దీపాలంకరణ
ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజున బ్రహ్మపుష్కరిణి కోనేరులో పంచసహస్ర దీపాలంకరణ చేస్తారు. కోనేరు మెట్ల మీద చుట్టూ ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు వెలిగించడంతో కోనేరు ఒక్కసారిగా దేదీప్యమానంగా వెలుగొందుతుంది. ధర్మపురి క్షేత్రం... ఆకాశాన మిలమిలలాడే చుక్కలన్నీ ఈ కోనేట్లో మణిదీపాలుగా వెలుగొందాయా…అన్నట్లుగా మెట్టుమెట్టుకో దీపం..అజ్ఙాన తిమిరాలు, కష్టాల చీకట్లను తరిమికొడుతూ అడుగుఅడుగుకూ ఓ దీపం..ఒక్కో దీపం అలా జ్వాలా తోరణమై పంచ సహస్ర దీపాలంకరణగా మారుతుంది.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం