Vemulawada Priest Escape : భక్తులకు శఠగోపం..! అధిక వడ్డీకి రూ. 2 కోట్ల అప్పులు తీసుకుని పూజారి పరార్
Vemulawada Priest Escape :వేములవాడలో అధిక వడ్డీ ఆశ చూపి ఓ పూజారి బురిడీ కొట్టించాడు. ఏకంగా రూ. 2 కోట్ల వరకు అప్పులు తీసుకున్న అతగాడు… రాత్రికి రాత్రే పరారీ అయ్యాడు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
Vemulawada Priest Escape : ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో పూజారి మహేష్ పారిపోయాడు. అధిక వడ్డీ ఆశ చూపి భక్తుల వద్ద బారీగా డబ్బులు అప్పుగా తీసుకుని శఠగోపం పెట్టాడు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా రెండు కోట్లకు పైగా వసూలు చేసి పారిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పూజారి నిర్వహించే జ్యోతిష్యాలయం, అమ్మభవాని ఆలయం మూసివేసి ఉండడంతో అనుమానం వచ్చిన భక్తులు ఆరా తీయగా పూజారి పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ వస్తుందని పూజారిని నమ్మి అప్పు ఇచ్చిన బాధితులు మోసపోయామని భావించి…. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
పూజలు…జ్యోతిష్యాలయం ఏర్పాటు
చాలా రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి వేములవాడకు వచ్చిన పూజారి మహేష్ మార్కండేయ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అమ్మభవాన్ని ఆలయంలో పూజారిగా పనిచేస్తూ అక్కడే జ్యోతిష్యాలయం ఏర్పాటు చేసుకుని జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడు. అలా తన వద్దకు వచ్చే భక్తులతోపాటు అప్పులు ఇచ్చే వారిని నమ్మించి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి డబ్బు అవసరముందని అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నాడు.
ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద దాదాపు రెండుకోట్లకు పైగా డబ్బులు వసూలు చేశాడు. అందరితో కలివిడిగా ఉంటు జ్యోతిష్యాలయం నిర్వహిస్తుండడంతో పూజారిని అందరూ నమ్మారు. అయితే పూజారి మాత్రం రాత్రికి రాత్రే పరార్ అయ్యాడు. రెండు రోజులుగా పూజారి కనిపించకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో బాధితులకు అనుమానం వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు ఫిర్యాదు చేశారు. పూజారిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరెవరి వద్ద ఎంత మేరకు అప్పుగా తీసుకున్నాడనేది ఆరా తీస్తున్నారు.
పూజారి పరారీపై ఎస్బీ విచారణ…
పూజారి మహేశ్ రూ.2కోట్ల అప్పులు చేసి ఉడాయించిన ఘటనను జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎస్పీ అఖిలమహాజన్ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ అధికారులు బాధితులు వివరాలు, పూజారి వివరాలు సేకరించారు. కొంత మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ వద్ద ఒకరి ఫిర్యాదు రాగా.. మరికొంత మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఎక్కువ మొత్తం డబ్బులు ఇచ్చిన బాధితుల్లో స్వయాన పూజారి మహేశ్ బావ ఉన్నట్లు సమాచారం. ఏకం గా రూ.47లక్షలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు రూ.20 లక్షల మేర మహేశ్ ఇంటిని రాసిచ్చినట్లు సమాచారం. అయితే డబ్బులిచ్చిన వారికి అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి సరైన సమయంలో చెల్లించలేక పరార్ అయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మహాలక్ష్మి వీధికి చెందిన ఓ దంపతులతో మహేశ్ లావాదేవీలు కొనసాగించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
వడ్డీ వ్యాపారులపై నిఘా…!
వేములవాడ ప్రాంతంలో అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై పోలీసులు నిఘాపెంచారు. స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారులపై ఆరా తీశారు. ఇప్పటికే పలుమార్లు దాడులు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు మరోమారు ఆకస్మిక దాడులు చేస్తారనే చర్చ జరుగుతుంది.
పేదల అవసరాలను అవకాశంగా తీసుకుంటున్న అక్రమ వడ్డీ వ్యాపారులు పెద్ద ఎత్తున వడ్డీ వసూలు చేయడంతో పేదల నడ్డి విరుగుతుందని జనం చెప్పుకుంటున్నారు. అప్పులు తీసుకున్న వారు అధిక వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు.
పూజారి పరార్ తో పోలీసులు విచారణ చేపట్టడంతో వడ్డీ వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు. పూజారి డబ్బులు తీసుకుని పారిపోవడంతో మోసపోయామని చెప్పుకోలేక వడ్డీ వ్యాపారులు సతమతం అవుతున్నారు.