Vemulawada News : వేములవాడలో దారుణం, మద్యం మత్తులో భక్తులిద్దరిని చితకబాదిన నలుగురు యువకులు-ఒకరు మృతి
Vemulawada News : వేములవాడలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. వేములవాడ ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న ఇద్దరు భక్తులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Vemulawada News : ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం జరిగింది. మద్యం మత్తులో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. మైకంలో ఇద్దరిని బట్టలుడదీసి చావబాదారు. మత్తుబాబుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.

మంచిర్యాల జిల్లా జెండా వెంకటాపురం గ్రామానికి చెందిన బావ బామ్మర్దులు శంకర్, రాజేందర్ లు ఈనెల 14న వేములవాడకు చేరుకున్నారు. నాగదోషం పూజ చేసుకొని రాత్రి తిరిగి వెళ్తుండగా నలుగురు యువకులు మద్యం మత్తులో భగవంతరావునగర్ వద్ద అడ్డగించారు. దొంగలుగా భావించి ఇద్దరిని చావబాదారు. బట్టలు ఊడదీసి చితక్కొట్టడంతో రాజేందర్ స్పృహ తప్పి పడిపోయాడు. శంకర్ లేవలేని స్థితికి చేరాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రాజేందర్ చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు.
హత్య కేసు నమోదు... పరారీలో నలుగురు
నాగదోషం పూజ కోసం వచ్చిన ఇద్దరు భక్తులు బావబామ్మార్దులు పూజ అనంతరం మద్యం సేవించారు. మత్తులో ఉన్న ఇద్దరు రాత్రి స్వగ్రామానికి బయలుదేరగా అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులైన నలుగురు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. దొంగలుగా భావించి ఇద్దరిని చావబాదారు. బావబామ్మార్దులు మత్తులో అడ్రస్ సరిగా చెప్పలేకపోయేసరికి మైకంలో ఉన్న నలుగురు తమ ప్రతాపం చూపారు. బట్టలు ఊడదీసి చావబాది పైశాచిక ఆనందం పొందుతారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. చివరకు రాజేందర్ ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు దాడి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని చావబాదిన నలుగురు యువకులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గంజాయి గ్యాంగ్...?
మద్యం మత్తులో ఇద్దరిని చావబాది ఒకరి మృతికి కారణమైన నలుగురు యువకులు గంజాయి బ్యాచ్ గా స్థానికులు భావిస్తున్నారు. నిత్యం మత్తులో జోగుతూ రాత్రిపూట తిరిగే వారిపై దాడులకు తెగబడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాగిన మైకంలో కన్ను మిన్ను కాకుండా ఇద్దరు భక్తులపై విచక్షణారహితంగా దాడి చేసి ఒకరిని ప్రాణాలు పోయేలా కొట్టిన నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నలుగురు వేములవాడకు చెందిన వారుగా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం