Vemulawada News : వేములవాడలో దారుణం, పసిపాపను రూ.90 వేలకు అమ్మేసిన తాగుబోతు తండ్రి-vemulawada father sold two months infant to 90k mother reached out police ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada News : వేములవాడలో దారుణం, పసిపాపను రూ.90 వేలకు అమ్మేసిన తాగుబోతు తండ్రి

Vemulawada News : వేములవాడలో దారుణం, పసిపాపను రూ.90 వేలకు అమ్మేసిన తాగుబోతు తండ్రి

HT Telugu Desk HT Telugu

Vemulawada News : వేములవాడలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు తండ్రి పది నెలల పసికందును రూ.90 వేలకు విక్రయించాడు. ముందుగా తల్లి సహకరించినప్పటికీ పేగు బంధం తెంచుకోలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వేములవాడలో దారుణం, పసిపాపను రూ.90 వేలకు అమ్మేసిన తాగుబోతు తండ్రి

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం జరిగింది. ఆడపిల్ల అంగడి సరకులా మారింది. తాగుబోతు తండ్రి 90 వేల రూపాయలకు పసిపాపను విక్రయించాడు. అందుకు తల్లి ముందుగా సహకరించినప్పటికీ పసికందు లేక పేగు బంధాన్ని తెంచుకోలేక పోలీసులు ఆశ్రయించడంతో పాప విక్రయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల జోక్యంతో తల్లి ఒడికి పాప చేరింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని లక్ష్మీపూర్ కు చెందిన బత్తుల శ్యామల-రవిందర్ దంపతులకు పది నెలల క్రితం ఓ పాప జన్మించింది. కూలి పనితో కుటుంబాన్ని పోషించుకునే దంపతులు.. ఆడపిల్ల అని భారంగా భావించారో లేక మద్యం మత్తులో కలిగిన ఆలోచనేమో?.. స్పష్టంగా తెలియక పోయినప్పటికీ పది నెలల పాప అమ్మకానికి గురయ్యింది. మద్యం మత్తులో భర్త రవిందర్ పాపను అమ్మకానికి పెట్టగా అందుకు భార్య శ్యామల సైతం సై అంది. 90 వేల రూపాయలకు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన లక్ష్మికి విక్రయించారు.‌ అందుకు ప్రాంసరీ నోటుపై 90 వేల రూపాయలు శ్యామల రవి దంపతులు తీసుకున్నట్లు...లక్ష్మీ ఇచ్చినట్లు రాయించుకున్నారు. పాపను తీసుకుని లక్ష్మీ స్వస్థలానికి వెళ్ళిపోయింది.

పేగు బంధాన్ని తెంచుకోలేక పోలీసులను ఆశ్రయించిన తల్లి

పేగు బంధాన్ని తెంచుకోలేక తల్లి శ్యామల పోలీసులను ఆశ్రయించడంతో పాప విక్రయం వెలుగులోకి వచ్చింది. పోలీసులను ఆశ్రయించిన శ్యామల తన పాపను ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టగా విక్రయించినట్లు తేలింది. పాపను కొనుగోలు చేసిన లక్ష్మికి ఫోన్ చేసి పాపతో సహా స్టేషన్ కు రప్పించారు. అమ్మకానికి గురైన పాపను క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. పాపను విక్రయించిన తండ్రి రవి పరారీలో ఉండగా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

తల్లిది విషాద గాథ

విక్రయానికి గురైన పాప తల్లిది ఓ విషాద గాథ తెలుగులోకి వచ్చింది. శ్యామలకు చిన్నప్పుడే వివాహం కాగ నలుగురు ఆడపిల్లలు జన్మించారు.‌ రెండేళ్ళ క్రితం భర్త మృతితో కూలి పనితో నలుగురు పిల్లలను పోషిస్తున్న శ్యామలకు రవి పరిచయమై రెండో పెళ్ళి చేసుకున్నాడు.‌ వారికి పది మాసాల క్రితం ఆడ పిల్లనే జన్మించింది. ఇప్పటికే నలుగురు ఆడపిల్లలతో ఇబ్బంది పడుతున్న ఆ దంపతులు పసిపాపను అమ్మాలని నిర్ణయించుకున్నారు. 90 వేలకు విక్రయించి అడ్డంగా బుక్ అయ్యారు. తాగిన మైకంలో ముందుగా భర్త చెప్పినట్లు విని పాపను విక్రయించిన శ్యామల, కడుపున పుట్టిన పాప‌ను వదిలి ఉండలేక తన పాప కావాలని పోలీసులను ఆశ్రయించింది. కరెన్సీ నోట్ల కంటే కడుపు తీపి గొప్పదని నిరూపించింది. భర్త ఇబ్బంది పెట్టడంతోనే పాపను విక్రయించేందుకు అంగీకరించానని, ప్రస్తుతం పాపని విడిచి ఉండలేనని శ్యామల స్పష్టం చేసింది.

అమ్ముతామంటేనే తీసుకున్నాం

ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారని ఓ పాపను విక్రయిస్తామని చెప్పడంతోనే డబ్బులు ఇచ్చి పాపను కొనుగోలు చేశామని, ఎత్తుకెళ్ళలేదని పాపను కొన్న లక్ష్మి తెలిపారు. పిల్లలు లేకపోవడంతో పాపను ప్రేమతో పెంచుకుందామని కొనుగోలు చేశామని చెప్పారు. పాప తల్లిదండ్రులు ఇద్దరు కలిసి 90 వేల రూపాయలు తీసుకుని పాపను ఇచ్చారని అందుకు ప్రామిసరీ నోటు రాయించుకున్నామని తెలిపారు. అలా కొనుగోలు చేయడం తప్పు కదా.. పిల్లలు కావాలంటే చట్ట ప్రకారం ఐసీడీఎస్ ద్వారా దత్తత తీసుకోవాలని పోలీసులు సూచించారు. పాపను అమ్మడం, కొనడం నేరం కాబట్టి పాపను విక్రయించిన పేరెంట్స్ తో పాటు కొనుగోలు చేసిన లక్ష్మీపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

రిపోర్టర్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు