Students Market: కరీంనగర్‌లో పాఠశాల విద్యార్థులతో కూరగాయల మార్కెట్‌, కొనుగోలు చేసిన కలెక్టర్-vegetable market with school students in karimnagar collector bought from students ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Students Market: కరీంనగర్‌లో పాఠశాల విద్యార్థులతో కూరగాయల మార్కెట్‌, కొనుగోలు చేసిన కలెక్టర్

Students Market: కరీంనగర్‌లో పాఠశాల విద్యార్థులతో కూరగాయల మార్కెట్‌, కొనుగోలు చేసిన కలెక్టర్

HT Telugu Desk HT Telugu

Students Market: సర్కారు బడిలో పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. సాగుబడితో మందులు లేకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించి మార్కెట్లో విక్రయించారు. విద్యార్థుల కూరగాయల మార్కెట్ ను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి కూరగాయలు కొనుగోలు చేశారు.

కరీంనగర్‌లో విద్యార్థులతో కూరగాయల మార్కెట్

Students Market: వ్యవసాయం పై ఆధారపడి జీవించే తల్లిదండ్రులు పడే కష్టనష్టాలపై అవగాహన కల్పించడానికి కరీంనగర్‌లో విద్యార్థులతో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు.

కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్.. రైతులు లేని విద్యార్థుల వెజిటబుల్ మార్కెట్ గా మారింది. నిత్యం కూరగాయలు విక్రయించే రైతులు, కొనుగోలు చేసే వినియోగదారులతో రద్దీ ఉండే రైతు బజార్ అరుదైన కార్యక్రమానికి వేదిక అయింది.

వినూత్నమైన కాన్సెప్ట్ తో విద్యార్థులతో మోడల్ వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పండించిన కూరగాయలను విద్యార్థులచే విక్రయించారు. విద్యార్థుల కూరగాయల మార్కెట్ ను కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి కలెక్టర్ తోపాటు జిల్లా అధికారులు ఉద్యోగులు వినియోగదారులుగా కూరగాయలు కొనుగోలు చేశారు.

మోడల్ వెజిటబుల్ మార్కెట్ కు మంచి స్పందన..

కరీంనగర్ జిల్లాలో వంద ప్రభుత్వ పాఠశాలల్లో జన్య ఫౌండేషన్ సహకారంతో కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు, అమ్మకాల బాధ్యతలను విద్యార్థులకే అప్పగించారు. అందులో ఎంపిక చేసిన 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 60 మంది విద్యార్థిని విద్యార్థులతో కాశ్మీర్ గడ్డ రైతు బజార్ లో ఏర్పాటు చేసిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ కు మంచి స్పందన లభించింది.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చొరవ చూపడంతో సత్ఫలితాలను ఇచ్చింది. పంట సాగు పద్ధతులు, లాభనష్టాలు, రైతుల శ్రమను విద్యార్థులు తెలుసుకునేలా విద్యాశాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్, ధన్గర్ వాడి, ఆసిఫ్ నగర్, బూరుగుపల్లి, మానకొండూరు, నుస్తులాపూర్, కన్నాపూర్, నాగులమల్యాల నగునూర్, జంగపల్లి, చెల్పూర్, కొత్తపల్లి, హుజురాబాద్ బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తమ పాఠశాలలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ఆకుకూరలను మోడల్ వెజిటేబుల్ మార్కెట్లో ప్రదర్శించి విక్రయించారు

విద్యార్థుల్లో బిజినెస్ స్కిల్...

విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ సరళి, కూరగాయల విక్రయం, కొనుగోలు, మెలకువలు, మార్కెట్ ను అంచనా వేయడం, వినియోగదారులను ఆకట్టుకునేలా వ్యవహరించడం, రైతులు పడుతున్న కష్టనష్టాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.

కూరగాయలు విక్రయిస్తున్న విద్యార్థిని విద్యార్థులతో చాలాసేపు ముచ్చటించారు. కూరగాయల రేట్లు, డిస్కౌంట్ ఇస్తున్న వైనం, నగదుకు సంబంధించిన లెక్కలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో బిజినెస్ స్కిల్స్ పెంపొందించేలా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వ్యాపార రంగంలో నైపుణ్య అభివృద్ధి పెంపొందించుకుంటున్నారని కితాబు ఇచ్చారు.

విద్యార్థులు సంతృప్తికరంగా జవాబులు ఇవ్వడంతో కలెక్టర్ వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కూరగాయల విక్రయం పై వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో ఏమేం చర్యలు తీసుకోవాలో స్వయంగా కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్రతి స్టాల్ ను సందర్శించి కూరగాయల రేట్లు వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు.

విస్తృత ప్రచారం కల్పించాలి..

సేంద్రియ పద్ధతులతో పాఠశాలల్లో పండించిన కూరగాయలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పండించామనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు.

ఈ విధంగా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివని ప్రజలకు సూచించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఒకవైపు విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ సరళి, మరోవైపు ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయల విక్రయంపై విద్యార్థులతో మార్కెట్ ఏర్పాటు చేయించడం సరికొత్త రికార్డు సృష్టించారు కరీంనగర్ కలెక్టర్.

(రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu Desk

సంబంధిత కథనం