Namo Drone Didi Scheme : నమో డ్రోన్ దీదీ పథకం మహిళలకు వరం.. వరంగల్ 'వకుల' అందరికీ ఆదర్శం!
Namo Drone Didi Scheme : వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. అదే సమయంలో స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కేంద్రం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
నమో డ్రోన్ దీదీ పథకం.. దేశంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న కార్యక్రమం. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని.. వరంగల్ జిల్లాకు చెందిన మహిళ సద్వినియోగం చేసుకున్నారు. స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు.
అన్నదాతకు దన్నుగా వకుల..
మెడిద వకులది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గ్రామం. నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా.. పైలట్ శిక్షణ పొందారు వకుల. శిక్షణ అనంతరం.. రూ.8 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్, ఇఫ్కో ద్వారా రూ.5.50 లక్షల విలువైన ఆటో, బ్యాటరీల ఛార్జింగ్ కోసం రూ.2.80 లక్షల విలువైన జనరేటర్‌ను వకుల ఉచితంగా పొందారు. వీటితో తన గ్రామంలోని అన్నదాతలకు సాంకేతిక సేవలు అందిస్తున్నారు. వకుల తన ప్రతిభ చూపిస్తూ.. రైతులకు డబ్బులు ఆదా చేస్తున్నారు.
రోజుకు 30 ఎకరాలు..
'సాధారణంగా పంపుతో అయితే.. లీటర్ మందు పిచికారి చేయడానికి దాదాపు 150 లీటర్ల నీరు అవసరం అవుతుంది. డ్రోన్ ద్వారా అయితే.. కేవలం 10 లీటర్ల లోపు మీరు చాలు. తక్కువ నీటితో డ్రోన్ ద్వారా పిచికారి చేయడం వల్ల.. మందు ప్రభావం పంట మొక్కలపై సరిగ్గా ఉంటుంది. కేవలం 7 నిమిషాల్లోనే ఒక ఎకరం పొలంలో పిచికారి చేయొచ్చు. నేను రోజుకు సుమారు 30 ఎకరాల వరకు పిచికారి చేస్తున్నాను. దీని రైతులకు ఎంతో మేలు జరుగుతుంది' అని వకుల వివరించారు.
డ్వాక్రా గ్రూపు మహిళలకే..
నమో డ్రోన్ దీదీ పథకం.. కేవలం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకే వర్తిస్తుంది. ఈ పథకం కింద, మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు కొనుగోలు చేయడానికి 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తారు. గరిష్టంగా రూ. 8 లక్షల వరకు ఇస్తారు. ఈ పథకం కింద 2024-25 నుండి 2025-26 వరకు దాదాపు 15 వేల డ్వాక్రా మహిళలకు డ్రోన్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది.
ఎంపిక.. శిక్షణ ఇలా..
స్వయం సహాయ సంఘాల సభ్యులు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలు.. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. రిజిస్ట్రేషన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ వంటి వివరాలను.. డ్రోన్ దీదీ జిల్లా కమిటీలకు అందించాలి. ఆ కమిటీలు అర్హతను బట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 15 రోజులపాటు శిక్షణ ఇస్తారు. 5 రోజులు డ్రోన్ పైలట్ శిక్షణ, మిగిలిన 10 రోజులు డ్రోన్ సాంకేతికత, వ్యవసాయ అనువర్తనాలపై శిక్షణ అందిస్తారు.