తెలంగాణలో 9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దిగ్గజ ఫార్మా కంపెనీ!-us pharma giant eli lilly chooses telangana to invest usd 1 billion for new pharma manufacturing plant ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో 9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దిగ్గజ ఫార్మా కంపెనీ!

తెలంగాణలో 9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దిగ్గజ ఫార్మా కంపెనీ!

Anand Sai HT Telugu

తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

తెలంగాణలో ఎలి లిల్లీ 9 వేల కోట్లు పెట్టుబడులు

ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలి లిల్లీ ప్రతినిధి బృందం సమావేశమైన అంగీకారం తెలియజేసింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్‌తో పాటు ఇతర ప్రతినిధులు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.

ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలి లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.9000 కోట్లు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో ఎలి లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది.

సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ఎలి లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది.

విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులతో ముందుకు రావటంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంస్థను ప్రశంసించారు. తెలంగాణపై విశ్వాసం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్‌గా ప్రఖ్యాతి గడించిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

1965లో ఇందిరాగాంధీ ఐడీపీఎల్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఫార్మా రంగం విస్తరించిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పేరొందిన దిగ్గజ ఫార్మా కంపెనీలుండటంతో దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఈ మాన్యుఫాక్చరింగ్, క్వాలిటీ సెంటర్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ పేర్కొంది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎలి లిల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్షరింగ్ నెట్వర్క్, సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది.

అమెరికాకు చెందిన ఎలి లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. ప్రధానంగా డయాబెటిస్‌, ఒబెసిటీ, ఆల్జీమర్‌, క్యాన్సర్‌, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎలి లిల్లీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆగస్ట్ నెలలో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.