Johnny Master Remand : చర్లపల్లి జైలుకు జానీ మాస్టర్‌.. 14 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు-upparpally court remands johnny master for 14 days in sexual harassment case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Johnny Master Remand : చర్లపల్లి జైలుకు జానీ మాస్టర్‌.. 14 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు

Johnny Master Remand : చర్లపల్లి జైలుకు జానీ మాస్టర్‌.. 14 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు

Basani Shiva Kumar HT Telugu
Sep 20, 2024 02:27 PM IST

Johnny Master Remand : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జానీ మాస్టర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.

పోలీస్ వాహనంలో జానీ మాస్టర్
పోలీస్ వాహనంలో జానీ మాస్టర్

కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని పోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించగా.. ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు గోల్కొండ ఆస్పత్రిలో జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉప్పరిపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో.. కోర్టు రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. 'నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నాపై తప్పుడు కేసు పెట్టించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీ నిరూపించుకుంటా. నన్ను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టను' అని జానీ మాస్టర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

జానీ మాస్టర్‌ అరెస్ట్‌పై గురువారం రాత్రి పోలీసులు ప్రకటన విడుదల చేశారు. జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్‌ చేశామని.. గోవా కోర్టులో హాజరుపర్చి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించామని చెప్పారు. జానీపై పోక్సోతో పాటు రేప్‌ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

జానీ మాస్టర్ వ్యవహారంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా.. నిర్మాత సీ.కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో జరిగిన ఘటన గురించి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులు దీని గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఉన్ని విషయాలు బయటపెడతానని స్పష్టం చేశారు.

లైంగిక వేధింపుల వ్యవహారంపై జానీ మాస్టర్ భార్య కూడా స్పందించారు. నిజంగా లైంగిక వేధింపులు జరిగితే.. తాను జానీ మాస్టర్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని ఏలా చెప్పిందని ప్రశ్నించారు. తన భర్తను కాలాలనే ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని వ్యాఖ్యానించారు.

జానీ తనతో కలిసి పనిచేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణపై ఇటీవల కేసు నమోదైంది. అవుట్ డోర్ షూటింగుల సమయంలో తనపై లైంగిక దాడి చేశాడని.. ఇంట్లో కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె నివాసం ఉన్నందున అక్కడికి కేసుని బదిలీ చేశారు. ఆమెపై జానీ మాస్టర్ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్.

జానీ మాస్టర్ రియాలిటీ డాన్స్ షో ఢీ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. 2009లో నితిన్, ప్రియమణి జంటగా నటించిన ‘ద్రోణ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ 2012లో రచ్చ సినిమాలో రామ్ చరణ్‌కు కొరియోగ్రఫీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో చేస్తూనే 2014లో హిందీలోనూ సల్మాన్ ఖాన్ నటించిన జై హో చిత్రానికి కొరియోగ్రఫీ చేశాడు. ఆ తర్వాత తమిళ్ సినిమాలకి జానీ మాస్టర్ పనిచేశారు.

Whats_app_banner