TG Indiramma Housing Survey : ఇందిరమ్మ ఇళ్ల సర్వే అప్డేట్స్ - లొకేషన్ ఆధారంగా ఇంటి స్థలం ఫొటోల అప్ లోడ్, ఇవిగో వివరాలు
TG Indiramma Housing Survey Updates : 'ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తోంది. జనవరి మొదటి వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు... దరఖాస్తుదారుడి ఇంటి స్థలం ఫొటోలను లొకేషన్ ఆధారంగా అప్ లోడ్ చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. గ్రామాలు, వార్డుల్లో సర్వేయర్లు వివరాలను సేకరిస్తున్నారు. మొత్తంగా ఏడు ప్రశ్నలకు తోడుగా అనుబంధ ప్రశ్నల ద్వారా వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకుగాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్ధాయి కలిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను సర్కార్ నియమించింది. వీరంతా కూడా స్కీమ్ అమలును పూర్తిస్థాయిలో పర్యవేక్షించనున్నారు.
ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులను సర్వేయర్లు పరిశీలిస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి… వివరాలను సేకరిస్తున్నారు. యాప్ లో నమోదు చేసే వివరాల ఆధారంగా… దరఖాస్తుదారుడు అర్హులా? కాదా? అనేది వెల్లడవుతుంది.
లొకేషన్ ఆధారంగా ఫొటోల అప్ లోడ్..!
గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ది పొందారా?, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది వంటి వివరాలను యాప్ లో సేకరిస్తున్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా? లేదా?, స్థలం లబ్దిదారుడి పేరు మీద ఉందా? కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా?, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుత గ్రామం/పట్టణంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు.
ఇక ముఖ్యంగా ఫొటోల అప్ లోడ్ విషయంలో సర్వేయర్లు జాగ్రత్త తీసుకుంటున్నారు. దరఖాస్తుదారుడికి స్థలం ఉంటే.. అదే లొకేషన్ ఆధారంగా ఫొటోను వెంటనే అప్ లోడ్ చేస్తున్నారు. ఈ స్థలం వివరాలను ఆకాంక్షలు, రేఖాంక్షాల(latitude - longitude) ఆధారంగా సేకరిస్తున్నారు. భవిష్యత్ లో స్థలం వివరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా స్థలం చూపించే విషయంలో అవినీతికి అస్కారం లేకుండా చూస్తున్నారు. ఒక వేళ పాత ఇంటి వద్దనే దిగాల్సి ఉంటే... ఆ లొకేషన్ ఆధారంగానే ఫొటోలను దింపి అప్ లోడ్ చేస్తున్నారు.
మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్‌గా పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా… అధికారులు పని చేస్తున్నారు.
మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేస్తారు. మరోవైపు యాప్ సర్వే పూర్తి అయిన వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. అంతేకాకుండా.. ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
సంబంధిత కథనం