Karimnagar News : నాలుగైదురోజులుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుంది. గాలి వాన, వడగళ్లు రైతన్నకు అపార నష్టం మిగిల్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురియడంతో చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కరీంనగర్, పెద్దపల్లి డివిజన్ లలో గాలి వానతోపాటు పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. గాలివానకు వెలాది ఎకరాల్లో వరి మొక్కజొన్న పంటలు నేలవాలాయి. పలు చోట్ల వడ్లు రాలాయి. మామిడి కాయలు రాలిపోయాయి. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో ఉన్న పంట దెబ్బతినడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఎకరాన 40 వేల వరకు పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితులో ప్రభుత్వాన్ని ఆదుకొమ్మని వేడుకుంటున్నారు.
అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. కరీంనగర్ మండలం నగునూర్ లో దెబ్బతిన్న పంటపొలాలను సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించారు. పంట నష్టపోయి ఆవేదనతో ఉన్న రైతులను ఓదార్చారు. అకాల వర్షాలతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లిందని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర పభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టంపై సర్వే చేయాలని, వారం రోజుల్లో రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులు అధైర్య పడోద్దని ప్రభుత్వం ఆదుకుని అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. కొత్తపల్లి మండల కేంద్రంలో అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షం ముంచెత్తి మొక్కజొన్న, మామిడి పంటతో పాటు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. చాలాచోట్ల వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని.. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సకాలంలో పరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలకు అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్టపరిహారం ఇప్పించేందుకు కలెక్టర్, సీఎం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. గత ప్రభుత్వాలు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పట్టించుకోలేదని కేవలం పర్యటనలకే పరిమితమై హామీలు ఇచ్చి ముఖం చాటేసారని ఎద్దేవ చేశారు. రాబోయే రోజుల్లో రైతులు పండించిన పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఆరుగాలం శ్రమించే అన్నదాతల పరిస్థితి గోటి చుట్టూ రోకటిపోటులా తయారయ్యింది. మొన్నటి వరకు అడుగంటిన భూగర్భ జలాలతో ఎండుతున్న పంటను కాపాడుకునేందుకు రైతన్నలును భగీరథ ప్రయత్నం చేశారు. ఎండుతున్న పంటను ప్రాణంగా కాపాడుకున్న రైతులను అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. కౌలు రైతులు ఎకరాకు 25 వేలు కౌలు చెల్లించడంతోపాటు 40 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో మొక్కజొన్న, 8 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మొన్నటి వరకు నీటి ఎద్దడితో సతమతమైన రైతులు, ప్రస్తుతం కురిసిన అకాల వర్షంతో ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పక్షం రోజుల్లో చేతికందే పంట ప్రకృతి కన్నెర్ర చేయడంతో తీవ్రనష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆదుకోమ్మని వేడుకుంటున్నారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం