KF Beers Supply : మందుబాబులకు గుడ్ న్యూస్, తెలంగాణలో మళ్లీ కేఎఫ్ బీర్లు వచ్చేస్తున్నాయ్
KF Beers Supply : కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తి సంస్థ యూబీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కేఎఫ్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
KF Beers Supply : తెలంగాణలోని మందుబాబులకు గుడ్ న్యూస్. కింగ్ ఫిషర్ బీర్లు మళ్లీ వచ్చేస్తున్నాయి. కేఎఫ్ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీఎల్) కీలక ప్రకటన చేసింది. తెలంగామలో కేఎఫ్ బీర్ల సరఫరాను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ధరలు, బకాయిలపై ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యూబీఎల్ పేర్కొంది.

రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి రూ.702 కోట్ల బకాయిలు కార్పొరేషన్ విడుదల చేయకపోవడం, ధరలు సవరించాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని కేఎఫ్ బీర్ల సరఫరాను యూబీఎల్ కంపెనీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆరు బీర్ల తయారీ సంస్థలున్నాయి. అయితే మార్కెట్ లోకి వచ్చే వాటిలో 75 శాతం వాటా యూబీఎల్ కంపెనీదే. యూబీఎల్ బీర్ల సరఫరా నిలిపివేయడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. దీంతో మద్యం ధరల పెంపుపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు ధరలపై నిర్ణయం తీసుకుంటామని, బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యూబీఎల్ బీర్ల సరఫరాను పునరుద్ధరించింది.
పెండింగ్ బిల్లులు, బీర్ల ధరలు పెంచకపోవటంతో యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ... ఇటీవల తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేస్తూ ప్రకటించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కల్పించుకుని బీర్ల సరఫరాపై దృష్టిపెట్టింది. యునైటెడ్ బ్రూవరీస్ సంస్థతో చర్చించింది. ఆ చర్చలు సఫలం కావటంతో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను మళ్లీ పునరుద్ధిస్తామని యూబీఎల్ సంస్థ ప్రకటించింది. అయితే ప్రస్తుత ధరలకే సరఫరా చేస్తారా? ధరలు పెంచుతారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కేఎఫ్ బీర్ల సరఫరా నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని యూబీఎల్ స్పష్టం చేసింది.
బీర్ల ధరలు, బకాయిల చెల్లింపుల హామీ అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చల సఫలం కావడంతో... బీర్ల పంపిణీ పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది యునైటెడ్ బ్రూవరీస్. బీర్ల సరఫరా ప్రకటనతో ఆ సంస్థ షేర్ ధర ఒక్కసారిగా దూసుకెళ్లింది. అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
సంబంధిత కథనం