సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ.. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా అవుతుందన్న కేంద్రమంత్రి!-union ministers unveil logo of sammakka sarakka central tribal university ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ.. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా అవుతుందన్న కేంద్రమంత్రి!

సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ.. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా అవుతుందన్న కేంద్రమంత్రి!

Anand Sai HT Telugu

సాంస్కృతిక వారసత్వం, సంచారం జాతుల ప్రజలు ఉండే ప్రాంతాల్లో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతున్నట్టుగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా నిలుస్తుందని చెప్పారు.

సమ్మక్క సారక్క యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ

దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు. ఈ యూనివర్సిటీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి తీసుకురావొచ్చని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తెలుగు, హిందీ, మరాఠీతో సహా లోకల్ ట్రైబల్ భాషపై పరిశోధన చేయవచ్చన్నారు. సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో వినూత్నగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. లోగోలో ట్రైబల్ భాషలు పొందుపరచడాన్ని అభినందించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణలో గిరిజనుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలనే కల నిజమైందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇప్పటికే యునివర్సిటీ కోసం కేంద్రం రూ.800 కోట్లకుపైగా నిధులు కేటాయించిందని తెలిపారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల వారికి కూడా యూనివర్సిటీ సేవలందిస్తుందన్నారు.

స్థానిక ప్రజల సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా కొత్త కోర్సులను తీసుకురావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నారు. కొత్త పరిశోధనలు, సృజనాత్మకతకు వేదికగా మార్చాలన్నారు. భారతీయ ఆయుర్వేదం, గిరిజనుల ఆహారం గురించి కోర్సుల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 'గిరిజన భాషల్లోనూ పాఠ్యాంశ బోధన ఉండాలి. ములుగు పరిసర ప్రాంతాల్లోని యువత క్రీడల్లో నైపుణ్యం ఉంటుంది. వారు క్రీడల్లో రాణించేలా చొరవ తీసుకోవాలి.' అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ జరుపుకొనే సందర్భంలో వారి పేరు మీద గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని, భవనాల నిర్మాణం త్వరితగతిన మెుదలుపెట్టాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరినట్టుగా వెల్లడించారు.

సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో లోగో ఆకట్టుకునేలా ఉంది. ఇందులో పలు చిహ్నాలు ఉన్నాయి. లోగో మధ్యలో సమ్మక్క సారక్కను సూచించేలా పసుపు బొమ్మలు ఉన్నాయి. సమ్మక్కను కుంకుమతో సూచించేందుకు మధ్యలో ఎర్రటి సూర్యుడిని పెట్టారు. నెమలి ఈకలు, సాంస్కృతిక గౌరవం, ధైర్యం సూచించేలా జంతువుల కొమ్ములతో కూడిన కిరీటం ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.