Kishan Reddy : రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే ప్రధానిపై రేవంత్ రెడ్డి విమర్శలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై విమర్శలు చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక వివాదం లేపుతున్నారన్నారు

Kishan Reddy : రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఏ సీఎం వారానికోసారి దిల్లీకి వెళ్లిన చరిత్ర లేదని, అక్కడ రాహుల్ గాంధీ చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై అనాలోచిత విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాహుల్ గాంధీ కులం కోసం దేశవ్యాప్తంగా సర్వే చేయాల్సిన అవసరం లేదని, ఆయన కులం ఏంటో ప్రజలకు తెలుసునన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం వరంగల్ నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముందుగా హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బంక్వెట్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరున ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఒక వివాదం లేపుతున్నారన్నారు. తెలంగాణ ప్రజానీకం ఎంతో తెలివైందని, రేవంత్ రెడ్డిలాంటి ఎందరో ముఖ్యమంత్రులను ఇక్కడి ప్రజలు చూశారన్నారు.
కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు పూర్తి నిరాసక్తతతో ఉన్నారని, తొందర్లోనే కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం రాబోతోందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడా తిరగలేని పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. ఇండ్లు, జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్ మెంట్, ప్రతి మండలానికో అంతర్జాతీయ స్థాయి స్కూల్, ఆరు గ్యారంటీలు.. ఇలా ప్రతి అంశంపై ప్రజలు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించే రోజులు ఎంతో దూరం లేవన్నారు.
బీఆర్ఎస్ ను ఫాలో అవుతున్న కాంగ్రెస్
ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీనే ఫాలో అవుతున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందినకాడికి అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. భూములు అమ్మడం, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందని, వనరులు సమకూర్చుకునే అంశంలో సరైన ప్రణాళిక లేకుండా పోయిందన్నారు.
ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు రోడ్డు మ్యాప్ కూడా లేదని, గుడ్డెద్దు చేలో పడ్డట్లు కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ భవనాలకు సున్నం వేసే పరిస్థితి ఉండదని, చాక్ పీస్ లు కూడా కొనే పరిస్థితి ఉండదని విమర్శించారు. ఘాటుగా, ఆవేశంగా మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు భరించరని, మాటలతో కడుపు నిండదని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు.
గతంలో పాలించిన బీఆర్ఎస్ ను గద్దె దించడానికి తెలంగాణ ప్రజలకు పదేళ్లు పట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 14 నెలల్లోనే అంతకంటే ఎక్కువ వ్యతిరేకత మూటకట్టుందన్నారు. రెండు పార్టీల పాలనకు ఎలాంటి తేడా లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలని విమర్శించారు.
తొందర్లోనే పార్టీకి కొత్త చీఫ్
తొందర్లోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ వల్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతోందని చెప్పుకొచ్చారు. 42 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా సర్వే పూర్తి చేయాలన్నారు.
ఆ తరువాత బీసీ సంఘాల ఆమోదం పొందాలని, మిగతా రాష్ట్రాల్లో అమలు అవుతున్నట్టే ఇక్కడా కూడా బీసీల రిజర్వేషన్ అంశంపై తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం