Bandi Sanjay: టిబెట్ శరణార్థుల్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, సమస్యలు పరిష్కరిస్తామని హామీ
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కర్నాటకలో పర్యటిస్తున్నారు. మైసూర్ జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన బైలకుప్పే ను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 14వ తేదీ ఉదయం దలైలామాతో బండి సంజయ్ భేటీ కానున్నారు.

Bandi Sanjay: బండి సంజయ్ టిబెట్ అధ్యాత్మిక గురువు దలైలామాతో భేటీ కానున్నారు. 1950లో టిబెట్ ను చైనా ఆక్రమించిన సమయంలో వేలాది మంది టిబెటియన్ శరణార్ధుల ఇండియాకు తరలివచ్చారు. వారందరికీ కేంద్ర ప్రభుత్వం కర్నాటకలోని మైసూర్ జిల్లా బైలకుప్పే ప్రాంతంలో పునరావాసం కల్పించింది. వీరికి నివాసాలను ఏర్పాటు చేయడంతోపాటు వ్యవసాయం చేసేందుకు అనువుగా 15 వేల ఎకరాలకుపైగా అటవీ స్థలాన్ని కేటాయించింది.
దక్షిణ భారతదేశంలోని టిబెటియన్ బౌద్ధ మత కేంద్రం ప్రస్తుతం బైలకుప్పేలో ఉంది. ఈ ప్రాంతంలో 15 వేల మందికిపైగా టిబెటియన్ శరణార్థులు ఇక్కడ నివసిస్తున్నారు. టిబెటియన్ బౌద్ధ సంప్రదాయాలకు అనుగుణంగా అనేక మఠాలు, మఠ పాఠశాలలు, దేవాలయాలను నిర్మించుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బైలకుప్పే కు చేరుకుని టిబెటియన్ శరణార్ధుల స్థితిగతులను పరిశీలించారు.
సమస్యలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి...
టిబెటియన్ శరణార్థుల స్థితిగతులు, సమస్యలను తెలుసుకునేందుకు బైలకుప్పేకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బౌద్ద మత గురువు 14వ దలైలామా ప్రతినిధి జుగ్మే జిగ్నే, మైసూర్ కాలనీల ప్రధాన ప్రతినిధి జూనియర్ జుగ్మే సుల్ట్రాన్, జిల్లా మైనారిటీ అధికారి శిల్ప, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం బైలకుప్పేలోని ఎఫ్ టీసీఐ గెస్ట్ హౌజ్ నుండి స్థానిక గోల్డెన్ టెంపుల్ ను దర్శించారు. గోల్డెన్ టెంపుల్ విశేషాలను బౌద్ద మత గురువుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా పద్మ సంభవ, బుద్ధ, అమితాయుస్ ల ఎత్తయిన (40 అడుగుల) భవ్య విగ్రహాలను దర్శించుకున్నారు. గోల్డెన్ టెంపుల్‌తో పాటు పెనూర్ రింపూచె సమాధి, సెరా లాచె ఫిలాసఫీ యూనివర్శిటీ టెంపుల్, ఆర్గానిక్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఓల్డెజ్ హోం లను సందర్శించారు. దలైలామా ప్రతినిధి జుగ్మెతోపాటు స్థానిక అధికారులు, బౌద్ద మతగురువులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలసుకున్నారు.
ఆధార్ కార్డులు ఇప్పించండి...
1950లో టిబెట్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారిలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవని టిబెటియన్ శరణార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలిపారు. తమ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డు విస్తరణలో భాగంగా చాలా మేరకు స్థలాన్ని కోల్పోతున్నామని, తగిన పరిహారం ఇప్పించాలని విజ్ఝప్తి చేశారు.
కన్నడ రైతులకు ప్రభుత్వం ఆర్ధిక సాయంసహా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, బైలకుప్పేలో సాగు చేసుకుంటున్న టిబెటియన్ రైతులకు సైతం వాటిని వర్తింపజేయాలని కోరారు. ఏనుగుల బెడద తీవ్రంగా ఉందని, వీటి దాడిలో మరణిస్తే సాయం అందడం లేదన్నారు. తాము విదేశాలకు వెళ్లేందుకు, తమ బంధువులు ఇక్కడికి వచ్చేందుకు వీసాల మంజూరు విషయంలో ఇండియన్లతో పోలిస్తే అనేక ఆంక్షలు విధిస్తున్నారని, ఇవి తమకు ఇబ్బందిగా మారిందన్నారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ త్వరలోనే వాటి పరిష్కారానికి క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు.
నేడు దలైలామాతో భేటీ...
రెండు రోజులపాటు బైలకుప్పే లో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఉదయం 14వ బౌద్ద మతగురువు దలైలామాతో భేటీ కానున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)