Bandi Sanjay : ఇందిరమ్మ అని పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay : ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు విడుదల కాదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ఫొటోలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డులపై మోదీ ఫొటో లేకపోతే రేషన్ కూడా ఇవ్వమన్నారు.
Bandi Sanjay : ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని స్పష్టం చేశారు.
"ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు కూడా రాదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు మంజూరు చేస్తుంది. పీఎం ఆవాస్ యోజనను పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో గ్యాబ్లింగ్ చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం...కానీ రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ఫొటోలు పెడతారు. రేషన్ కార్డులపై నరేంద్ర మోదీ ఫొటో లేకపోతే మీకు రేషన్ కూడా ఇవ్వం. ఇండ్లు ఇచ్చే క్రమంలో పేదలకు అన్యాయం చేయం, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది కానీ ఫొటోల విషయం రాజకీయం చేస్తే కుదరదు. పైసలు కేంద్రానివి ప్రచారాలు కాంగ్రెసోళ్లవి"అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్
కరీంనగర్ మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరారు. కరీంనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ...రేవంత్ రెడ్డి, కేసీఆర్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తామే రేషన్ కార్డులు ముద్రించి ప్రజలకు ఇస్తామని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి గురువు కేసీఆర్ అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఏం చేశారో రేవంత్ రెడ్డి అదే పనిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో కొత్తదనం ఏమీలేదని విమర్శించారు.
దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం
'ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? కాళేశ్వరం అవినీతి ఎక్కడకు పోయింది? కేటీఆర్, కేసీఆర్‌ను ఎందుకు జైల్లో వేయడం లేదు? రేపే అరెస్ట్ అని ఇంకా ఎన్ని రోజులు అంటారు? ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు? గ్రీన్ కో కంపెనీ నుంచి కాంగ్రెస్ కు డబ్బులు ముట్టలేదా?. ముఖ్యమంత్రి దావోస్‌కు రెండుసార్లు పోయినా.. పెట్టుబడులపై స్పష్టత లేదు. పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలి' అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
"స్మార్ట్ సిటీకి కేంద్రం డబ్బులు ఇస్తే గత కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనిపై కొట్లాడితే కరీంనగర్, వరంగల్ కు స్మార్ట్ సిటీ డబ్బులు విడుదల చేశారు. వారం రోజుల్లో డబ్బులు విడుదల చేయకపోతే మిత్తితో సహా వసూలు చేస్తామని వార్నింగ్ ఇస్తే అప్పుడు స్మార్ట్ సిటీ పైసలు విడుదల చేశారు. బీజేపీ వల్లనే కరీంనగర్ అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతి. ఇవాళ కాంగ్రెస్ సర్కార్ ఏమైనా మారిందా అంటే...ఏం మారలేదు. రేవంత్ రెడ్డికి కేసీఆరే గురువు"- బండి సంజయ్
ఫోన్ ట్యాంపింగ్ కేసుపై
'ఫోన్ ట్యాపింగ్ లో ఆధారాలున్నాయని అంటున్నారు. అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తుంటే... ఈ కేసు ఎక్కడా ముందుకు సాగడంలేదు. ఫార్ములా ఈ కేసు...రేపే అరెస్టు అంటారు. పేపర్లు, టీవీల్లో బ్రేకింగ్ ఇస్తారు. రెండ్రోజులు అదే విషయం ఉంటుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సీఎం, మంత్రులు ఆరోపణలు చేశారు. ఆధారాలుంటే అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటి. దిల్లీ పోతారు పైసల్ తెచ్చుకున్నారు ఫార్ములా ఈ కేసు గురించి ఎవరూ మాట్లాడరు' అని బండి సంజయ్ అన్నారు.
కాంగ్రెస్ కు సవాల్
"ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను విడిచిపెట్టి గ్రీన్ కో అనే సంస్థపై ఏసీబీ దాడులు చేస్తుంది. ఈ సంస్థ తెలంగాణకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి సంస్థలపై దాడులు చేస్తే అవి రాష్ట్రాన్ని విడిచిపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారు. గ్రీన్ కో సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసల్ ముట్టలేదా? ఈ సంస్థ నుంచి డబ్బులు తీసుకోలేదని నిరూపించండి. కాంగ్రెస్ పార్టీ నా సవాల్ కు సిద్ధమా? పైసల్ తీసుకుంటారు, మళ్లీ అదే సంస్థలను ఇబ్బందులు పెడతారు" - బండి సంజయ్