Bandi Sanjay : రాజకీయాల నుండి తప్పుకుంటా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తొక్కేస్తున్నారని.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను నిరూపిస్తానని, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిరూపిస్తా.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తనకు, రేవంత్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
సంగారెడ్డిలో పర్యటించిన బండి సంజయ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీలో సెటిల్‌మెంట్.. కేటీఆర్ అరెస్ట్... కథ కంచికే. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే. కలెక్టర్‌పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమే. రాష్ట్రంలో ఆర్‌కే బ్రదర్స్ పాలన నడుస్తోంది. రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తెచ్చారు' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
'బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ. దాడులతో ప్రజల ప్రాణాలాతో చెలగాటాలాడుతోంది. గ్రూప్ 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుంది. ఓ రెండు రోజులు నేను కాళ్ల నొప్పితో కనపడలేదు. దానికి బీఆర్ఎస్ వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ సంగతి చెబుతామని వచ్చాను. లేచినా, పడుకున్న బీఆర్ఎస్ నేతలకు నేను గుర్తుకు వస్తున్నా' అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.
'ధాన్యం కొనుగోలు చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ పెట్టుకుంది. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో దళారులకు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారు. ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనస్ అని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే అని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది' అని బండి సంజయ్ విమర్శించారు.
'తెలంగాణలో బీఆర్ఎస్‌ను నిషేధించాలి. రాష్ట్ర ప్రజలారా వాస్తవాలు ఆలోచించండి.. ప్రతీ విషయంలో బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది. నేను కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నా.. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాల్లేవ్. వేరే వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారు. ఎవరికి ఇచ్చినా.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం. తెలంగాణలో అధికారంలోకి వస్తాం' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.