Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్, సీపీఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబం దొంగ నోట్లు ముద్రించి ఉద్యమంలో ఎన్నికల్లో పంచిందని ఆరోపించారు. దొంగ నోట్లతో కోటీశ్వరులయ్యారని విమర్శించారు. కరీంనగర్ లోని శుభం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఆత్మీయ సన్మానానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసిందని ఆరోపించారు. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడిందని, ఆప్, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కాం చేసి జైలుకు పోయారని తెలిపారు. వాళ్లంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతూ మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లంతా దేశ జీడీపీకి, పార్లమెంట్ లో ప్రాతినిధ్యానికి లింకు పెట్టడంపై మండిపడ్డారు.
చెన్నైయ్ లో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లిక్కర్ దొంగల ముఠా ఒకే చోట సమావేశమై విచిత్రమైన తీర్మానం చేశారని ఆరోపించారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్ లో కూడా దక్షిణాదికి 36 శాతందాకా వాటా ఇవ్వాలని అడుగుతున్నారన్నారు...ఇదేం విచిత్రం? అని నిలదీశారు.
దేశ జీడీపీకి పార్లమెంట్ లో ప్రాతినిధ్యానికి సంబంధమేంది? అట్లనుకుంటే తెలంగాణ జీడీపీ(Gross domestic product)లో వెనుకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతినిధ్యం ఉండకూడదా? ఇదెక్కడి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ ను అడ్డుకునే కుట్రలు చేయడమేందని ఫైర్ అయ్యారు.
తెలంగాణ సాధనలో టీచర్ల, ఉద్యోగుల పాత్ర మరువలేమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 42 రోజుల సకల జనుల సమ్మె చేసి తెగించి కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నారని చెప్పారు. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ అప్పుల పాలైందని ద్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి , మూర్ఖత్వ పాలనతో సర్వ నాశనమయిందని ఆరోపించారు.
గతంలో కేసీఆర్ మనుషులు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ లో దొంగ నోట్లు ముద్రించారని.. ఆ ప్రింటింగ్ ప్రెస్ ను మూసివేసేందుకు మన రాష్ట్ర పోలీసులు వెళితే... ఒత్తిడి తెచ్చి అక్కడికి వెళ్లకుండా చేశారని ఆరోపించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పంచిన నోట్లన్నీ దొంగ నోట్లేనని, బీఆర్ఎస్ పాలన పీడ విరగడ కావాలని ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చాడుని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నమని విమర్శించారు.
కేంద్రం ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ ఇస్తోంది... నిత్యం మోదీపై విషం కక్కే కాంగ్రెస్ ప్రభుత్వం 5 డీఏలు ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరో 3 నెలలైతే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. టీచర్ల, ఉద్యోగుల పెండింగ్ బిల్స్ మొత్తం రూ.8వేల కోట్లు. అట్లాగే రిటైర్డ్ మెంట్ బెన్ పిట్స్ బకాయిలు రూ.11 వేల కోట్లు. వీళ్లకు పైసలు ఇవ్వమంటే డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం 18 శాతం కమీషన్ ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు బిల్స్ క్లియర్ చేస్తోందని ఆరోపించారు.
టీచర్లను, తపస్ నాయకులను తాను ఒక్కటే కోరుతున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తపస్ తల్చుకుంటే విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన కావాలన్నారు. విద్యా శాఖను అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టి తుపాకీ రాజ్యం తేవాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం విద్యార్థులకు కలం అందించి మహానుభావులుగా తీర్చిదిద్దాలని చూస్తుంటే... కాంగ్రెస్ అందుకు భిన్నంగా పాఠ్యపుస్తకాల్లో అర్బన్ నక్సల్స్ భావజాలాన్ని జొప్పించి తుపాకీ రాజ్యం కోసం కుట్రలు చేస్తుందని విమర్శించారు.
అసలు ఏ ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అర్బన్ నక్సల్స్ ను విద్యా కమిషన్ లో నియమించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని తపస్ కచ్చితంగా వ్యతిరేకించి ఉద్యమం కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగం నుండి తీసేస్తదనే భయం వద్దని కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి తపస్ కు అండగా ఉంటుందన్నారు.
ఎంతకాలం బతికామన్నది ముఖ్యంకాదు.. బతికి ఉన్నంత కాలం జీవితమంతా స్పూర్తిదాయకంగా ఉండేలా పోరాడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హీరోలెక్క బతకాలే తప్ప జీరో కావొద్దని సూచించారు. 317 జీవో సహా టీచర్ల సమస్యలపై నిరంతరం పోరాడి జైలుకు పోయింది బీజేపీయేనని.... ప్రజల కోసం కొట్లాడితే నాపై 109 కేసులు పెట్టారని తెలిపారు.
తపస్ నాయకులు కూడా టీచర్ల సమస్యలపై, ప్రజల కోసం పోరాడాలని కోరారు. ఉద్యోగం కోల్పోతే వాళ్లకే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని తేలిపోయిందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 70 శాతం బిజేపి ప్రాతినిధ్యం కలిగి ఉందన్నారు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం