Bhadradri Talambralu: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన..-unexpected response from devotees to tsrtc door delivery of bhadrachalam kalyana talambralu
Telugu News  /  Telangana  /  Unexpected Response From Devotees To Tsrtc Door Delivery Of Bhadrachalam Kalyana Talambralu
శ్రీరామ నవమి వేడుకల కోసం సిద్ధం చేస్తున్న రాముల వారి తలంబ్రాలు
శ్రీరామ నవమి వేడుకల కోసం సిద్ధం చేస్తున్న రాముల వారి తలంబ్రాలు

Bhadradri Talambralu: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన..

29 March 2023, 9:57 ISTHT Telugu Desk
29 March 2023, 9:57 IST

Bhadradri Talambralu: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. పదిరోజుల వ్యవధిలోనే 50వేల మందికి పైగా భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. టిఎస్‌ఆర్టీసి పార్సిల్ ద్వారా భద్రాద్రి రాముల వారి తలంబ్రాలను అందచేస్తుండటంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేస్తున్నారు.

Bhadradri Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల మంది తలంబ్రాలు కావాలని ఆర్డర్లు బుక్ చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించడంతో వాటి కోసం పెద్ద ఎత్తున భక్తులు పోటీ పడుతున్నారు. రూ.116 చెల్లించి బుక్‌ చేసుకుంటే కల్యాణ అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేసేందుకు టిఎస్‌ ఆర్టీసి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్‌ జరుగుతోంది.

భక్తుల నుంచి వచ్చిన స్పందనతో మరో అవకాశాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్గో పార్శిల్‌ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించనున్నారు.

''భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందని, తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా విదేశాల నుంచి బుకింగ్‌లు వస్తున్నాయని టిఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దుబాయ్‌, అమెరికా, తదితర దేశాల నుంచి కాల్‌ చేసి తలంబ్రాలు కావాలని అడుగుతున్నారని వివరించారు. కేవలం 10 రోజుల్లోనే 50 వేల బుకింగ్‌లు వచ్చాయని, నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. విశిష్టమైన తలంబ్రాలను భక్తులు పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్‌ తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు.