రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం ప్రతిష్ఠాత్మకంగా రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియను పూర్తిచేసి.. ప్రస్తుతం వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ పథకం కింద తొలిఏడాది 5 లక్షల మందికి మంజూ రుపత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిట్టు సమాచారం.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా మంజూరు పత్రాలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కీమ్ అమలులో భాగంగా.. 3 నెలల్లో నెలకు రూ.2 వేల కోట్లు చొప్పున ఖర్చు చేయనున్నారు. అంటే దాదాపు రూ.6 వేల కోట్ల విలువైన యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోంది.
రాజీవ్ యువవికాసం పథకం కింద ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకానికి దాదాపు 16.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్ఠంగా రూ.4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు.
యూనిట్ కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. రూ.లక్ష లోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. రూ.1-2 లక్షలు, రూ.2-4 లక్షల యూనిట్ల కేటగిరీ రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద రూ.2-4 లక్షల విలువైన యూనిట్లు 20 వేలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. దాదాపు 3.24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
బీసీ కార్పొరేషన్ కింద 22 వేల యూనిట్ల కోసం 6.66 లక్షల మంది, ఈబీసీల్లో 8 వేల యూనిట్ల కోసం 32 వేల మంది దరఖాస్తు చేశారని అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి.. నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.
ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందినవారు.. ఐదేళ్లపాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్‌తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్‌తో పరిశీలిస్తున్నారు. సరైన అకౌంట్‌లు ఇచ్చారా.. లేదా అని చెక్ చేస్తున్నారు. జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
సంబంధిత కథనం