Hyderabad ORR : ఓఆర్ఆర్‌పై లగ్జరీ కార్లతో అర్ధరాత్రి విన్యాసాలు.. ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు-two youths arrested for performing stunts with luxury cars on hyderabad orr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Orr : ఓఆర్ఆర్‌పై లగ్జరీ కార్లతో అర్ధరాత్రి విన్యాసాలు.. ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు

Hyderabad ORR : ఓఆర్ఆర్‌పై లగ్జరీ కార్లతో అర్ధరాత్రి విన్యాసాలు.. ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు

Hyderabad ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రోడ్డుపై ఇద్దరు యువకులు లగ్జరీ కార్లతో విన్యాసాలు చేశారు. నంబర్ ప్లేట్లు తీసేసి.. అర్ధరాత్రి హంగామా చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

ఇటీవల ఇద్దరు యువకులు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై హంగామా చేశారు. నంబర్ ప్లేట్లు తొలగించిన లగ్జరీ కార్లతో అర్ధరాత్రి విన్యాసాలు చేశారు. తమ కార్లను ఎవరూ గుర్తుపట్టరని అనుకున్నారు. కానీ.. పోలీసులు ఈ ఇద్దర్నీ అరెస్టు చేశారు. లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అసలు ఏం జరిగింది..

ఫిబ్రవరి 9వ తేదీన రెండు కార్లు రయ్‌మంటూ ఓఆర్ఆర్ ఎక్కాయి. వాటికి నంబర్ ప్లేట్లు లేవు. ఆ కార్లు వేగంగా శంషాబాద్ మండలం తొండుపల్లి దగ్గరకు వచ్చాయి. ఆ కార్లలో ఉన్న యువకులు ఒక్కసారిగా హ్యాండ్ బ్రేక్ వేశారు. కార్లను రోడ్డు మధ్యలో గిరగిరా తిప్పుతూ విన్యాసాలు చేశారు. రోడ్డు మధ్యలో ఇలా చేయడంతో.. ఇతర వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

ఫుటేజీ ఆధారంగా..

ఈ స్టంట్లకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కార్లకు నంబర్ ప్లేట్లు లేకున్నా.. అందులోని యువకులు ముఖాలు కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. ఫుటేజీ ఆధారంగా ఆర్‌జీఐ విమానాశ్రయ పోలీసులు యువకులను గుర్తించారు. రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ ఒబైదుల్లా (25), మలక్‌పేటకు చెందిన జోహైర్ సిద్ధిఖీ (25)లను గుర్తించి.. సోమవారం అరెస్టు చేశారు. విన్యాసాలకు ఉపయోగించిన (ఫార్చునర్, బీఎండబ్ల్యూ) కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గతంలోనూ..

ఇప్పుడే కాదు.. గతంలోనూ ఓఆర్ఆర్‌పై కార్ రేసులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో యువత కార్లతో విన్యాసాలు చేయడం కామన్‌గా మారిందని వాహనదారులు చెబుతున్నారు. రేస్‌లు, విన్యాసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే.. భవిష్యత్తులో ఇలాంటివి చేయబోరని అభిప్రాయపడుతున్నారు.

నగరం చుట్టూ..

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగరం చుట్టూ దాదాపు 158 కిలోమీటర్ల మేర ఉంది. దీన్ని నిర్మించాక నగరంలో ట్రాఫిక్ సమస్య కాస్త తగ్గింది. ఈ రింగ్ రోడ్డుపై అత్యాధునిక భద్రతా చర్యలు తీసుకున్నారు. అనేక చోట్ల సీసీ కెమెరాలు బిగించారు. స్పీడ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా.. వెంటనే పోలీసులకు తెలిసేలా వ్యవస్థ ఉంది.