Telangana Police : తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య
Telangana Police : ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో జరిగాయి. కామారెడ్డి జిల్లాలో ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చనిపోయిన ఘటన మరువక ముందే వీరు సూసైడ్ చేసుకున్నారు.
మెదక్ జిల్లా కొల్చారంలో తీవ్ర విషాదం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే గమనించిన తోటి సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సాయికుమార్ మృతికి కొత్త కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. నర్సాపూర్‌లో టిఫిన్ సెంటర్ నడిపే మహిళతో వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలున్నాయి.
సిద్ధిపేటలో..
సిద్ధిపేట జిల్లాలోనూ ఓ పోలీస్ కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగు మందు తాగి ఉరి వేసుకున్న కానిస్టేబుల్ బాలకృష్ణ మృతి చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు విషమిచ్చిన తర్వాత బాలకృష్ణ ఉరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య అని అనుమానిస్తున్నారు.
వరుస ఘటనలు..
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అసలు పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల కిందటే ములుగు జిల్లాలో ఎస్సై సూసైడ్ చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో ఈ దారుణం జరిగింది. ఆత్మహత్యకు కారణమైన సూర్యాపేట జిల్లాకు చెందిన యువతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కామారెడ్డిలో సంచలనం..
కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్ చనిపోవడం సంచలనంగా మారింది. ఈ కేసులో తాజాగా ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకునేందుకు శృతి చెరువులో దూకింది. శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్సై సాయి, నిఖిల్ కూడా మృతిచెందారు. మరోవైపు మిస్టరీగా మారిన ఈ కేసులో విచారణ సాగుతోంది. మృతుల కుటుంబీకులతో పాటు స్నేహితులు, తోటి ఉద్యోగులు, బంధువుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
పరిచయం.. ప్రేమ..
ఈ ముగ్గురి మృతికి వారి మధ్య ఏర్పడిన పరిచయమే కారణంగా తెలుస్తోంది. అది చివరికి ప్రాణాలు తీసుకునేవరకు వచ్చింది. బిక్కనూరు ఎస్సై సాయికుమార్ గతంలో బీబీపేటలో ఎస్‌హెచ్‌వోగా పనిచేశారు. అప్పుడు అక్కడ రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పరిచయం ఏర్పడింది. బీబీపేటకే చెందిన నిఖిల్ కంప్యూటర్ల మరమ్మతులు చేసేవాడు. ఆ పని మీద పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు సాయికుమార్, శృతిలతో పరిచయం ఏర్పడింది.