Sangareddy Police : గంజాయి స్మగ్లర్లతో కలిసి దందా..! ఇద్దరు SIలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే దందాకు తెరలేపారు. ఏకంగా స్మగ్లింగ్ ముఠాతో కలిసి వ్యవహారాలు సాగించారు. అయితే అసలు నిందితులు దొరకటంతో పోలీసుల బాగోతం బయటపడింది. దీంతో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తున్న పోలీసుల ఉదంతం సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. అక్రమంగా గంజాయి రవాణా ని అడ్డుకోవాల్సిన పోలీసులే స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తున్నారని విచారణలో తేలింది. ఈ కేసులో ఇద్దరు ఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఆర్ కానిస్టేబుల్ ను సస్సెండ్ చేస్తూ మల్టీ జోస్ 2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న అంబారియా మనారు పోలీస్ స్టేషన్ లో పని చేశారు. ఆయనతో పాటు ప్రసుతంత వీఆర్ లో ఉన్న మరొక ఎస్ఐ వినయ్ కుమార్, సంగారెడ్డి సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మారుతీ నాయక్ తో పాటు ఏఆర్ కానిస్టేబుల్ మధు (డ్రైవర్) కూడా పని చేశారు.
టీమ్ గా ఏర్పడి.....
ఈ సంవత్సరం మే నెలలో అంబారియా మనూరు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో గంజాయి రవాణా సమాచారం వచ్చింది. ఎస్ఐ అంబారియా, హెడ్ కానిస్టేబుల్ మారుతీ నాయక్, డ్రైవర్ గా పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ మధు మనూరు మండలం సనత్ పూర్ సమీపంలో మాటు వేసి గంజాయి వాహనాన్ని అడ్డుకున్నారు. దానిలో నుండి 120 కేజీల గంజాయిని తమ వాహనంలో తీసుకొని, ఆ వాహనంతో పాటు నేరస్థులను వదిలేశారని విచారణలో తేలింది.
అంతే కాకుండా ఏడు నెలల క్రితం గంజాయి రవాణా చేసే వాహనాన్ని నిజామాబాద్ జిల్లా వర్ని వద్ద ఇదే బృందం పట్టుకుంది. అనంతరం అక్కడి నుండి వాహనాన్ని నారాయణఖేడ్ తీసుకొని వెళ్లి 400 ప్యాకెట్ ల గంజాయిని తీసుకొని… అక్రమ రవాణా చేస్తున్న వాహనంతో పాటు నిందితులను వదిలిపెట్టారు.
అసలు కథ వెలుగులోకి.......!
ఇటీవల సంగారెడ్డి జిల్లా బానూరు, చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నేరస్థులైన మల్లుగొండ, మల్లేష్ నాయక్, లాకస్ ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ పోలీసుల విచారణలో పోలీసుల చేతివాటం బయటపడింది. ఈ వ్యవహారాలు తేలడంతో ఎస్పీ… ఐజీకి నివేదిక పంపించారు. దీని ఆధారంగా ఐజీ సత్యనారాయణ స్పందించి వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అక్రమ గంజాయి రవాణా తో పాటు మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్ శాఖలో ఒకరిద్దరు చేసే ఇటువంటి పనులతో మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని ఐజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. తదుపరి విచారణ కొనాగుతున్నదని.. ఇంకా గంజాయి స్మగ్లర్లతో ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే దిశగా విచారణ కొనసాగుతున్నదని చెప్పారు.
రిపోర్టింగ్ : ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు.
సంబంధిత కథనం