Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి
Rains in karimnagar District : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో వర్షం కురుసింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది.
Rains in karimnagar District : అల్పఫీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన భీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వానతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగు పాటుకు రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
కరీంనగర్ జిల్లాలో రెండు పశువులు మృతి చెందాయి. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో వ్యవసాయ పనులకు వెళ్ళిన వారిపై పిడుగుపడడంతో కంబాల శ్రీనివాస్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు కొమురమ్మ, ఎల్లవ్వ, దేవయ్య, శ్రీనివాస్ అస్వస్థతకు గురికావడంతో వెంటనే స్థానికులు వేములవాడ ఆసుపత్రికి తరలించారు.
వ్యవసాయ పొలం వద్ద పనికి వెళ్ళిన ఐదుగురు వర్షంతో చెట్టు దగ్గర నిల్చోగా పిడుగు పాటుకు గురయ్యారు. అటు తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ పిడుగుపాటుకు భరత్ నగర్ కు చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య(50) మృతి చెందారు. పొలం పనులకై వెళ్ళగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి లో పిడుగు పాటుకు రెండు ఆవు దూడలు మృతి చెందాయి. పలు చోట్ల వర్షానికి కల్లాల్లో దాన్యం తడిసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో ఐదురోజులు వర్షాలు..
అల్పఫీడన ద్రోణి ప్రభావంతో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్ల క్రింద ఉండవద్దని వ్యవసాయ పొలాలకు వెళ్ళే వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడవకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం అకాల వర్షాలతో ఊపిరిపీల్చుకున్నారు. ఆకాశం మేఘావృతం అయి వాతావరణం జల్లబడడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు.
రిపోర్టింగ్ - HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR
సంబంధిత కథనం