CMR College case : సీఎంఆర్‌ కాలేజీ కేసులో ఇద్దరు అరెస్ట్‌.. బాత్రూమ్‌ల్లోకి తొంగిచూసినట్లు గుర్తింపు!-two people from bihar arrested in cmr college case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cmr College Case : సీఎంఆర్‌ కాలేజీ కేసులో ఇద్దరు అరెస్ట్‌.. బాత్రూమ్‌ల్లోకి తొంగిచూసినట్లు గుర్తింపు!

CMR College case : సీఎంఆర్‌ కాలేజీ కేసులో ఇద్దరు అరెస్ట్‌.. బాత్రూమ్‌ల్లోకి తొంగిచూసినట్లు గుర్తింపు!

CMR College case : సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ.. ఇటీవల విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ ఫోకస్ పెట్టారు. వేగంగా దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ ఇద్దరు బాత్రూమ్‌ల్లోకి తొంగిచూసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎంఆర్‌ కాలేజీ కేసులో ఇద్దరు అరెస్ట్‌

సీఎంఆర్‌ కాలేజీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీహార్‌కు చెందిన నందా కిశోర్‌, గోవింద్‌ కుమార్‌ అరెస్ట్‌ అయ్యారు. వీరు అమ్మాయిల హాస్టల్లోని బాత్రూమ్‌ల్లోకి తొంగిచూసినట్లు గుర్తించారు. కిశోర్‌, గోవింద్‌తో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంఆర్‌ కాలేజీ ఛైర్మన్‌ చామకూర గోపాల్‌రెడ్డిపైనా కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.

సీఎంఆర్ కాలేజీ డైరెక్టర్‌ జంగారెడ్డి, ప్రిస్సిపల్‌ అనంతనారాయణ, వార్డెన్‌ ప్రీతిరెడ్డి, క్యాంపస్‌ వార్డెన్‌ ధనలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. కిశోర్‌, గోవింద్‌ విద్యార్థినులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినా.. యాజమాన్యం పట్టించుకోకుండా వదిలిపెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో యాజమాన్యం బెదిరింపులకు దిగినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

అసలు ఏం జరిగింది..

మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బాలికల హాస్టల్‌లో.. వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఛైర్‌పర్సన్ శారద సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

విద్యార్థుల ఆరోపణ..

గత మూడు నెలల్లో దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు రహస్యంగా రికార్డ్ చేశారని విద్యార్థులు ఆరోపించారు. వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చినందుకు బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ సభ్యులతో కలిసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇష్యూలో హాస్టల్ సిబ్బంది ప్రమేయం ఉండవచ్చని విద్యార్థులు అనుమానిస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని తొక్కేయడానికి ప్రయత్నించిందని, బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విద్యార్థులను హెచ్చరించిందనే ఆరోపణలు ఉన్నాయి.

పోలీసులు వెర్షన్..

సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ పరిసరాలను పరిశీలించామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం క్లియర్‌గా కనపడుతోందన్నారు. ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయని ఇటీవల వెల్లడించారు. మెస్‌లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించి, ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరికి చెందిన 12 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. టెక్నికల్ టీం ఫోన్లని అనేక విధాలుగా పరిశీలించారని వెల్లడించారు. వాటిలో ఎలాంటి వీడియోలు, ఫోటోలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు.

ల్యాబ్‌కు ఫోన్లు!

'ఒకవేళ డిలీట్ చేసి ఉంటారని ఫోన్లన్నీ ల్యాబ్‌కి పంపించాం. ఇప్పటివరకు అయితే ఎలాంటి వీడియోలు లభించలేదు. విద్యార్థులు భయాందోళనకు గురికావద్దు. పోలీసులు కూడా యాజమాన్యంతో మాట్లాడదాం అనుకుంటే.. అందుబాటులోకి రావడం లేదు. హాస్టల్ పరిసరాలు పరిశీలించిన తర్వాత.. సెక్యూరిటీ మెజర్మెంట్స్ యాజమాన్యం పట్టించుకోలేదని అపించింది. విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డు చేశాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం' అని పోలీసులు చెబుతున్నారు.