Tax Collections: కరీంనగర్లో రెండు మునిసిపాలిటీలు రికార్డు స్థాయిలో 100శాతం పన్ను వసూళ్లు చేశాయి. గడువు కంటే ముందే పన్నులు వసూలు చేయడంలో హుజురాబాద్, జమ్మికుంట రికార్డు సృష్టించాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపుకు ఇక పది రోజులు గడువు మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తి వసూలుకు మున్సిపల్ అధికారులు పడరాని పాట్లుపడుతున్నారు. పెండింగ్ లో ఉన్న ఆస్తిపన్ను వసూలుకు రెడ్ నోటీసులు జారీ చేసి మున్సిపల్ సేవలను నిలిపి వేస్తున్నారు. సెలవు దినాల్లో సైతం పని చేసి పన్ను వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అలాంటి చర్యలకు అవకాశం లేకుండా కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట రెండు మునిసిపాలిటీలు 100% ఆస్తిపన్ను వసూలుచేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. తెలంగాణలో 143 మున్సిపాలిటీ లు ఉండగా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు గడువుకు 11 రోజుల ముందు పూర్తి స్థాయిలో పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించాయి.
హుజూరాబాద్ మున్సిపాలిటీ లోని 30 వార్డులు, 8917 నివాసాలు ఉన్నాయి. రూ.2 కోట్ల 64 లక్షల అస్థి పన్ను బకాయిలు ఉన్నాయి. గత రెండు నెలల క్రితం బదిలీ పై వచ్చిన కమీషనర్ సమ్మయ్య చొరవతో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 100 శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయడంలో సఫలీకృతం అయ్యారు.
8917 నివాసాల కు గాను రూ.2 కోట్ల 64 లక్షలు గడువు కంటే ముందే వసూలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పోలీస్ శాఖ నుండి రూ.5 లక్షల 41 వేలు, కోర్టు బిల్డింగ్ ల ద్వారా రూ.3 లక్షల 80 వేలు, ఎంపిడివో కార్యాలయం ద్వారా రూ.1 లక్షల18 వేలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రూ.1 లక్ష 18 వేలు, చెల్లింపులు జరిగాయి. వంద శాతం పన్నులు వసూళ్ళు జరిగినందున 15 వ ఆర్ధిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సత్వరమే వచ్చే అవకాశం ఉందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. పట్టణ ప్రజలు 100 శాతం పన్నులు చెల్లించి మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించినందున కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులు, 12484 నివాసాలు ఉన్నాయి. వ్యాపార కేంద్రం కావడంతో కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల ఆస్తి పన్ను బకాయిలు ఉండగా గడువు పక్షం రోజుల ముందే మొత్తం మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల వసూలు చేసి రికార్డు సృష్టించారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు వంద శాతం పన్నులు వసూలు చేయడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. రెండు మున్సిపాలిటీల అధికారులను సిబ్బందిని పలువురు అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆస్తి పన్ను వసూలకు కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులు ఉద్యోగులు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. సెలవు దినాల్లో సైతం పన్ను వసూలు పైనే దృష్టి కేంద్రీకరించారు. కమిషనర్ చహత్ జాబ్ పాయ్ సైతం సెలవు రోజుల్లో నగరంలో పర్యటిస్తూ ఆస్థి పన్ను బకాయి వసూళ్ల కోసం ఉద్యోగులకు దిశా నిర్దేశం చేస్తూ భారీగా బకాయి ఉన్న వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు.
రెడ్ నోటీస్ అందుకున్నా పన్ను చెల్లించని వారికి మున్సిపల్ పరంగా సేవలను నిలిపి వేస్తున్నారు. మునిసిపల్ నల్లా కనెక్షన్ తొలగిస్తున్నారు. పన్ను వసూలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు 70% కూడా పన్ను వసూలు కాలేదు. కరీంనగర్లో పరిస్థితి ఇలా ఉంటే రెండు మునిసిపాలిటీలు 100% వసూలు చేయడంతో వారిని స్పూర్తిగా తీసుకొని కరీంనగర్ ప్రజలు పన్ను చేయాలని కోరుతున్నారు.
(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం