హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి మరో రెండు రైల్వేస్టేషన్లు!-two more railway stations to be available in hyderabad city soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి మరో రెండు రైల్వేస్టేషన్లు!

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి మరో రెండు రైల్వేస్టేషన్లు!

హైదరాబాద్ నగర వాసులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో మరో రెండు రైల్వే స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. అయితే.. వాటిల్లో కొన్ని రైళ్లను ఆపాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ట్రైన్ల స్టాపేజీపై స్పష్టమైన ప్రకటన రాలేదు. దీని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రైల్వే స్టేషన్ (unsplash)

హైదరాబాద్ నగరంలో మరో రెండు రైల్వేస్టేషన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. చర్లపల్లి- మౌలాలి- బొల్లారం మార్గంలో కొత్తగా నిర్మించిన ఆర్కేనగర్, దయానంద్‌నగర్‌ రైల్వేస్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌లో భాగంగా.. దయానంద్‌నగర్, ఆర్కే నగర్‌లో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌.. వీటిని పరిశీలించారు. పలు సూచనలు చేశారు.

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేలా..

ఈ రైల్వేస్టేషన్లు అందుబాటులోకి వచ్చాక.. ఆర్కేనగర్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేలా ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇందుకోసం 21 కోచ్‌లకు సరిపడా ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తున్నట్టు చెప్పారు. అయితే.. ఈ రైలుతో పాటు ఆదిలాబాద్‌- తిరుపతి, విశాఖపట్నం - నాందేడ్, నర్సాపూర్‌ - నాగర్‌సోల్, విశాఖపట్నం - షిర్డీ సాయినగర్, నాగావళి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపాలంటూ ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రయాణికుల విజ్ఞప్తి..

సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడకు మళ్లించారు. ఇది మల్కాజిగిరి స్టేషన్‌‌లో ఆపితే ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని.. వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు చర్లపల్లి నుంచి మేడ్చల్, చర్లపల్లి నుంచి ఉందా నగర్, చర్లపల్లి నుంచి హైదరాబాద్, చర్లపల్లి నుంచి లింగంపల్లి వయా మల్కాజిగిరి, రద్దీ సమయాల్లో చర్లపల్లి నుంచి లింగంపల్లికి 2 ఎంఎంటీఎస్‌లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

40కి పైగా రైల్వే స్టేషన్లు..

మొత్తంగా హైదరాబాద్ పరిధిలో 40 కి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిల్లో సికింద్రాబాద్ జంక్షన్, హైదరాబాద్ డెక్కన్ (నాంపల్లి స్టేషన్), కాచిగూడ, లింగంపల్లి, బేగంపేట, మల్కాజ్‌గిరి, ఫలక్‌నుమా, చర్లపల్లి ముఖ్యమైనవి. ఈ స్టేషన్ల నుంచి పలు ప్రధాన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి రద్దీ పెరగడంతో.. ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను అత్యాధునిక హంగులతో నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

చర్లపల్లి కీలకం..

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మొత్తం 9 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి. 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఉన్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు ఉన్నాయి. హైక్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉన్నాయి. మొదటి అంతస్తులో కేఫ్‌టేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉన్నాయి. విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉంది.

రైళ్ల వివరాలు..

చర్లపల్లి స్టేషన్ నుంచి పలు రైళ్లు ప్రారంభమవుతాయి. 12603/04 - చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 18045/46 - ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, 12589/90 - గోరఖ్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. 17625/26 - డెల్టా ఎక్స్‌ప్రెస్, 17405/06 - కృష్ణా ఎక్స్‌ప్రెస్, 12705/06 - గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, 17229/30 - శబరి ఎక్స్‌ప్రెస్, 12713/14 - శాతవాహన ఎక్స్‌ప్రెస్, 17201/02 - గోల్కొండ ఎక్స్‌ప్రెస్, 17233/34 - భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, 12757/58 - కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, 17659/60 - కాకతీయ ఎక్స్‌ప్రెస్, 17645/46 - రేపల్లె ఎక్స్‌ప్రెస్, 17011/12 - సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, 18309/10 - నాగావళి ఎక్స్‌ప్రెస్‌కు ఇక్కడ స్టాపేజీ ఉంది.

సంబంధిత కథనం