Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ - కూపీ లాగుతున్న సిట్..!
Telangana Phone Tapping Case Updates : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో ఇద్దరు పోలీసులు అరెస్ట్ అయ్యారు. వీరిని సిట్ బృందం విచారిస్తోంది.
Phone Tapping Case Updates: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో(Telangana Phone Tapping Case) మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను సిట్(SIT) బృందం అదుపులోకి తీసుకుంది. ట్యాపింగ్ వ్యవహారంలో వీరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించటంతోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు బృందం విచారిస్తోంది. తాజాగా అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఉన్నారు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలతో పాటు మరికొన్ని అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్…
ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు అరెస్ట్ కావటంతో… ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ప్రణీత్ రావు అరెస్ట్ తో మొదలైన ఈ వ్యవహారంలో ఇటీవలే ఇద్దరు అదనపు ఎస్పీలు కూడా అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతస్థాయి అధికారితో పాటు మరికొందరికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారంలోకి ఉంది. ఈ సమయంలో… ప్రధానంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మరికొందరి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరేకాకుండా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసి… డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురు పోలీసు అధికారులను అరెస్టు అయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అదనపు ఎస్పీలు ఉన్నారు. మొదటగా ఎస్ఐబీ డీఎస్సీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు.
ఇక అప్పటి బీఆర్ఎస్ (BRS)ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో సాంకేతిక సలహాదారుగా ఉన్న రవి పాల్… ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) సంభాషణలను వినడానికి కావాల్సిన ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసేందుకు సహకరించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు రవిపాల్ పై అభియోగాలు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పరికరాల దిగుమతికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదని దర్యాప్తు అధికారుల బృందం గుర్తించింది. రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఏర్పాటు చేసిన ఈ తరహా నిఘా వ్యవస్థతో 300 మీటర్ల పరిధిలో మాట్లాడే ఏదైనా వినవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిపాల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మీడియా సంస్థ నిర్వహకుడు శరణ్ రావుతో పాటు సిటీ టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారి రాధా కిషన్ రావు కోసం కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు రిమాండ్ లో ఉన్నారు. వీరిని కస్టడీకి తీసుకునే యోచనలో సిట్ బృందం ఉంది. ఇక ప్రభాకర్ రావును ఇక్కడికి రప్పించి…. విచారించే దిశగా సిట్ అడుగులు వేస్తోంది.