TG Constables Suicides: మహిళ వేధింపులతో ఒకరు, ఆన్‌లైన్ మోసంతో మరొకరు.. మెదక్ కానిస్టేబుళ్ల ఆత్మహత్యల వెనుక మిస్టరీ
TG Constables Suicides: ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీస్ శాఖలో మరణాలు కలకలం రేపుతున్నాయి. రోజుల వ్యవధిలోనే పలువురు సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడటం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహిళ వేధింపులు తాళలేక ఒకరు, ఆన్‌లైన్ మోసాలతో మరొకరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
TG Constables Suicides: మెదక్‌జిల్లాలో పోలీస్ శాఖలో సూసైడ్స్ ఆగడం లేదు. ఎస్సై, కానిస్టేబుల్ ఉదంతం మరువక ముందే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఆదివారం ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
మెదక్ జిల్లా కొల్చారం పోలీసెస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచే స్తున్న కాటూరి సాయికుమార్ స్టేషన్ ఆవరణలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీకి చెందిన సాయికుమార్ 1992లో పోలీస్ శాఖలో ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి నర్సాపూర్‌లో నివాసం ఉంటున్నారు.
సాయి కుమార్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా వారిద్దరికి వివాహాలు జరిగాయి. కొల్చారం పట్టణానికి చెందిన దివ్య అనే మహిళతో ఇటీవల సాయికుమార్‌కు పరి చయం ఏర్పడటంతో ఇద్దరూ ఫోన్లో మాట్లాడు కునేవారు. ఇది తెలిసిన మహిళ భర్త శివకుమార్, అల్లుడు కిరణ్ కుమార్‌లు సాయికుమార్‌ను డబ్బు కోసం వేధిస్తున్నారు.
దివ్యను సాయికుమార్ వేధిస్తున్నాడని ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం తీవ్రమైతే పరువు పోతుందని సాయికుమార్ ఆందోళన చెందాడు. శనివారం విధులకు హాజరైన ఆయన ఆదివారం మార్నింగ్ బయటకు వెళ్లి పనిచేసే స్టేషన్‌కు వచ్చారు. చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చి స్టేషన్ ఆవరణలో ఖాళీగా ఉన్న క్వార్టర్ వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సాయికుమార్ కోసం గాలించారు. క్వార్టర్ల వెనుక వైపు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన సాయికుమార్ కుటుంబం మూడుదశాబ్దాలుగా నర్సాపూర్‌లో స్థిరపడింది. 1992లో ఉద్యోగంలో చేరారు. ఏడాది క్రితం కౌడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై కొల్చారం వచ్చారు. 3 రోజుల కిందట కామారెడ్డిలో మృతిచెందిన ఎస్సై సాయికుమార్ కూడా కొల్చారం గ్రామస్తుడే కావడం అందరిని విషాదంలో నింపింది.
ఆన్‌లైన్ మోసంతో మనస్తాపం…
భారీగా ఆదాయం వస్తుందనే నమ్మకంతో ఆన్‌లైన్‌లో అప్పులు చేసి రూ.25లక్షల పెట్టుబడులు పెట్టిన కానిస్టేబుల్ మోసపోయానని తెలిసి అప్పులు తీర్చలేననే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనతో పాటు భార్యా పిల్లలకు విషం తాగించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగ న్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
బాలకృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం సాయంత్రం విధులకు హాజరై ఇంటికి వచ్చిన బాలకృష్ణ ఆందోళనగా ఉండటంతో భార్య ఆరా తీసింది. బాలకృష్ణ 15 రోజుల క్రితం అప్పులు చేసి.. మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని కంపెనీలో విడతల వారీగా రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తరువాత కంపెనీ నిర్వాహకులు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి బాలకృష్ణ ఆందోళనకు గురయ్యాడు.
అధిక లాభాల మీద ఆశతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేదని, అంతా కలిసి చనిపో దామని భార్యను ఒప్పించాడు. శనివారం రాత్రి పడుకునే ముందు టీలో ఎలుకల మందు కలిపి భార్యతో కలిపి పిల్లలకు తాగించి తాను కూడా తాగారు. ఆ తర్వాత అంతా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు స్పృహలోకి వచ్చిన బాలకృష్ణ ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నారు. ఆయన భార్య సమీప బంధువులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ భార్య, పిల్లలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.