Bhadradri Kothagudem : కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత - ఇద్దరు విలేకరులు అరెస్ట్-two journalists caught smuggling ganja in bhadradri kothagudem ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadradri Kothagudem : కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత - ఇద్దరు విలేకరులు అరెస్ట్

Bhadradri Kothagudem : కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత - ఇద్దరు విలేకరులు అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Jan 31, 2025 06:49 AM IST

భద్రాచలంలో హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు జరిపారు. ఈ వాహన తనిఖీల్లో బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు, అతని సోదరుడు పండగ వెంకటేశ్వర్లు, మరో వ్యక్తితో కలిసి కారులో తరలిస్తున్న గంజాయితో పట్టుబడ్డారు.

గంజాయి తరలిస్తూ ఇద్దరు అరెస్ట్ (representative image )
గంజాయి తరలిస్తూ ఇద్దరు అరెస్ట్ (representative image )

భద్రాచలం ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తూ, అనేక మంది అనేక సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా తాజాగా బాధ్యతాయుత వృత్తిలో కొనసాగుతున్న పాత్రికేయులే గంజాయి తరలిస్తూ, పట్టుబడటం తీవ్ర సంచలనం సృష్టించింది.

yearly horoscope entry point

హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ అధికారులు భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనీఖీ చేసే క్రమంలో అక్కడికి చేరుకున్న హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 ఆస్టా(నంబర్: AP37 BU 5216) కారును తనిఖీ చేశారు. ఆ కారులో ఉన్న 81.950 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.

గంజాయి తరలిస్తున్న ఆ కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకుని విచారించిన నార్కోటిక్స్ అధికారులు వారి వివరాలు రాబట్టారు. వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు (సూర్య పత్రిక విలేకరి) పట్టుబడ్డాడు. అతని తమ్ముడు మరో విలేకరి పండగ వెంకటేశ్వర్లు (తెలంగాణ కేసరి పత్రిక), ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కుంట తాలూకా మర్లగూడ గ్రామానికి చెందిన మడవినంద కూడా పట్టుబడ్డారు. కారు, గంజాయితో సహా స్వాధీనం చేసుకున్న అధికారులు వాటితో పాటు నిందితులను భద్రాచలం టౌన్ పోలీసులకు అప్పగించి వివరాలు వెల్లడించారు.

విలేకర్ల ముసుగులో ఎన్నెన్నో..

అక్షర పరిజ్ఞానం, సామాజిక అవగాహన, కనీస విద్యార్హతలు లేని అనేక మంది వ్యక్తులు జర్నలిజం ముసుగు తొడుక్కొని చేస్తున్న ఆగడాలు, చీకటి మాటు దందాలు అన్నీ ఇన్నీ కావు. సమాజంలో జర్నలిజమే వృత్తిగా జీవిస్తున్న వారికి మచ్చ తీసుకొచ్చేలా వీరి కార్యకలాపాలు ఉంటున్నాయి.

గతంలో పోలీస్ శాఖ డేగ కన్ను వేసినప్పటికీ కంచే చేను మేసిన చందంగా ఆ శాఖలో ఉన్న కింది స్థాయి ఉద్యోగులే ఈ నకిలీరాయుళ్లకు సహకరిస్తున్న తీరుతో చాప కింద నీరులా వీరి కార్యకలాపాలు సాగిపోతున్నాయి. జిల్లాలో జర్నలిస్ట్ ప్రెస్ స్టిక్కర్లు ద్విచక్ర వాహనంతో పాటు బీఎండబ్ల్యూ కార్లకు కనిపిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతుంది. విలేకరుల ముసుగులో చోటుచేసుకుంటున్న ఆగడాలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ప్రతి పీఎస్ పరిధిలో జర్నలిస్టుల ముసుగులో ప్రెస్ స్టిక్కర్లు తగిలించుకొని అక్రమ దందాలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Whats_app_banner

సంబంధిత కథనం