Road Accident: పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలను లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కావడంతో మాపటి కూలీ కోసం వెళ్తుండగా.. అటుగా వచ్చిన పత్తి గింజల బస్తాల లారీ వారిపైకి దూసుకొచ్చింది. దీంతో కూలీలు పక్కనే ఉన్న పొలంలోకి పరుగులు తీశారు. లారీ బోల్తా పడి అందులో ఉన్న బస్తాలు వారిపై కూలడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. ఇంకొందరు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఈ ఘటన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టీ) గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రామకృష్ణాపూర్ (టి) గ్రామానికి చెందిన మోకిడి సంధ్య (28), మోకిడి పూలమ్మ (45) సమీప బంధువులు. ఎండా కాలం కావడంతో గ్రామంలోని కొంతమంది మహిళలు ఉదయం పూట కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని వరిపొలంలో బెరుకులు ఏరడానికి మంగళవారం మోకిడి సంధ్య, మోకిడి పూలమ్మ మరో అరుగురితో కలిసి కూలీ పనికి వెళ్లారు. ఉదయం కూలీకి వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు.
పేద, మధ్య తరగతి కుటుంబాలు కావడం, కూలీ పనులే ఉపాధి కావడంతో పొద్దటి కూలీకి వెళ్లొచ్చిన అనంతరం వారంతా కలిసి ఎండ తగ్గిన తర్వాత సాయంత్రం కూలీ కోసమని బయలు దేరారు. నడుచుకుంటూ గ్రామ శివారుకు చేరుకోగా.. ఎదురుగా ఓ లారీ వేగంగా వస్తుండటం గమనించారు.
అక్కడ మూల మలుపు ఉండటంతో కంట్రోల్ తప్పిన లారీ కూలీల వైపు దూసుకొచ్చింది. దీంతో లారీని గమనించిన కూలీలు పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగులు తీశారు. కాగా మూల మలుపు వద్దకు వచ్చిన లారీ అదుపు తప్పి పొలాల వైపు బోల్తా కొట్టింది.
లారీలో ఉన్న పత్తి గింజల బస్తాలు సంధ్య, పూలమ్మపై కూలాయి. మరికొంత మంది త్రుటిలో తప్పించుకున్నారు. కాగా బస్తాలు మీద కూలడంతో సంధ్య, పూలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్, జేసీబీ సహాయంతో బస్తాలను తొలగించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్ధం నిమిత్తం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రామకృష్ణాపూర్ (టి) గ్రామానికి చెందిన పూలమ్మ భర్త కిషన్ టేకుమట్ల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఆమె కూడా కొన్ని రోజులుగా అక్కడే నివాసం ఉంటోంది. గ్రామంలో కూలీ పనుల కోసం వచ్చి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు.
సంధ్య భర్త రాజు కూడా కూలి పనుల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. రాజు తాపీ మేస్త్రీ చేతి కింద పనికి వెళ్లగా సంధ్య వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి మృత్యువు బారిన పడింది. దీంతో రాజు, ఆయన కొడుకులు ఇద్దరు తీవ్రంగా రోధించడం చూపరులను కంటతడి పెట్టించింది.
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా కూలీలు ప్రమాదానికి గురై మృతి చెందడంతో రామకృష్ణాపూర్ (టి) గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులిద్దరూ బంధువులు కావడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం