Farmer Suicide : అప్పు తీర్చలేక అన్నదాత బలవన్మరణం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం-two farmers died in jayashankar bhupalpally district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Farmer Suicide : అప్పు తీర్చలేక అన్నదాత బలవన్మరణం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం

Farmer Suicide : అప్పు తీర్చలేక అన్నదాత బలవన్మరణం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం

Farmer Suicide : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు రైతుల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా.. ప్రమాదవశాత్తు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ వేర్వేరు కారణాలతో మృతి చెందారు. పెద్ద దిక్కును కోల్పోయి బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు.

సూర కుమారస్వామి (ఫైల్ ఫొటో)

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రపురంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన సూర కుమారస్వామి (44) వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాడు.

ఆరేళ్ల కిందట వలస..

సొంతంగా భూమి లేకపోవడంతో ఆరేళ్ల కిందట ఇదే మండలంలోని తిరుమలాపురం శివారు గుంటూరుపల్లికి భార్యా పిల్లలతో కలిసి వలస వెళ్లాడు. అక్కడ నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉండగా.. కౌలు రైతుగా ఉన్న కుమారస్వామికి ఎదిగిన బిడ్డ ఉంది. కొంతకాలం కిందట ఆమె పెళ్లి చేశాడు. వ్యవసాయం కోసం పెద్ద మొత్తంలో అప్పు చేయడం, బిడ్డ పెళ్లి కోసం తెచ్చిన అప్పులతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవన్న బాధతో.. కుమారస్వామి తీవ్ర మనో వేదనకు గురయ్యాడు.

పురుగుల మందుతాగి..

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 19వ తేదీన తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల రైతులు గమనించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కుమారస్వామి కన్ను మూశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అందరితో మంచిగా ఉండే కుమారస్వామి అకాల మరణంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విద్యుదాఘాతంతో మరో రైతు..

ఇదే జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లికి చెందిన ఓ రైతు విద్యుత్తు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఇట్టబోయిన రవి(49) అనే రైతు తన పంట చేనుకు నీళ్లు పెట్టడానికి గురువారం రాత్రి వెళ్లాడు. మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో విద్యుత్తు షాక్ తగిలింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు. ఎవరూ గమనించకపోవడంతో అస్వస్థతకు గురై ఘటనా స్థలంలోనే ప్రాణం కోల్పోయాడు.

పొలం వద్ద విగతజీవిగా..

శుక్రవారం అటుగా వెళ్లిన కొందరు రైతులు గమనించి.. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. వారు తమ పొలం వద్ద విగత జీవిగా పడి ఉన్న రవిని చూసి బోరున విలపించారు. మృతుడికి భార్య రజిత, ముగ్గురు కొడుకులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.