Fake Police : కరీంనగర్ లో నకిలీ పోలీసులు...! అడ్డంగా దొరికిపోయారు
కరీంనగర్ లో ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. పోలీస్ అవతారం ఎత్తి డబ్బులు వసూలు చేస్తున్న ఆ ఇద్దరిన్ని కటకటాల వెనక్కి పంపించారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. కొత్తపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
వారిద్దరు చేసేది ఆర్టీసీ అద్దె బస్సులే డ్రైవర్ పని...! ఒంటిపై వేసుకుంది ఖాకీ డ్రెస్సే కదా అని పోలీస్ అవతారం ఎత్తారు. ఆటో వాలాలను ఒరిజినల్ ఆర్సీ అడిగి డబ్బులు వసూలు చేశారు. ఇవ్వకుంటే బెదిరించారు. చివరకు వారి పాపం పండింది. అసలు పోలీసులకు చిక్కి చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన చెక్రాల రాజు, గొట్టెముక్కల విజయ్ లు ఇద్దరు ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ గా పని చేస్తారు. వేసుకుంది ఖాకి డ్రెస్సే కదా అని వారి బుద్ధి అడ్డదారి తొక్కింది.
వేములవాడ రూట్ లో వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ డబ్బు వసూలు చేయడం మొదలు పట్టారు. వాహనాల పేపర్ లు ఉన్నాయా అంటు నిలధహదీసి ఒరిజినల్ సర్టిఫికెట్ లు చూపించాలని బెదిరించి అక్రమ వసూళ్ళకు పాల్పడ్డారు. వారి వాలకం చూసి అనుమానించిన ఓ ఆటోవాలా పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి పట్టుబడ్డారు.
ఒరిజినల్ అడిగి పోలీసులకు చిక్కి...
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన మహమ్మద్ అజ్మత్ పాషా నలుగురు పురోహితులను తీసుకుని వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చాడు. అదే ఆటోలో తిరుగు ప్రయాణం అయిన వారిని ఆసిఫ్ నగర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు నిలువరించారు.
తాము పోలీసులమని ఆటోకు సంబంధించిన ఆర్సీతో పాటు ఇతరాత్ర పేపర్లు చూపించాలని అడిగారు. మొబైల్ ఫోన్ లో ఉన్న స్మార్ట్ కాపీలను ఆటో డ్రైవర్ అజ్మత్ పాషా వారికి చూపించగా, హార్డ్ కాపీలు లేనందున ఫైన్ కట్టాలని బెదిరించడంతో అనుమానించిన అజ్మత్ వారిని ఐడెంటిటీ కార్డులు అడగడంతో వారిద్దరు అక్కడి నుండి పారిపోయారు. అదే సమయంలో అటుగా వెల్లిన ఇతర వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేసిన విషయాన్ని గమనించిన అజ్మత్ పాషా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని పట్టుకుని 308(3), 319(2 ), 204 ఆఫ్ బి ఎన్ ఎస్ - 2023, సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. దుర్బుద్ధితో పోలీస్ అవతారం ఎత్తి చివరకు పోలీసులకే చిక్కి కటకటాలు లెక్కించడం సంచలనంగా మారింది.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం