Khammam Tragedy : ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్య
Khammam Tragedy : కొత్త సంవత్సరం వేళ ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటనలు జరిగాయి. ఉరేసుకొని ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. మధిర మండలంలో ఓ విద్యార్థి, వెంగన్నపాలెంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధిర మండలం గురుకుల విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. వెంగన్నపాలెంలో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.
మధిర మండలం కృష్ణాపురం గురుకుల సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ముదిగొండ గ్రామానికి చెందిన సాయి వర్ధన్ అనే విద్యార్థి .. సోమవారం నుంచి కళాశాలకు వచ్చాడు. రాత్రి సమయంలో కళాశాల ఆవరణలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల వివరాలను సేకరిస్తున్నారు.
సెల్ ఫోన్ కొనివ్వలేదని..
తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిన వివరాల ప్రకారం.. వెంగన్నపాలేనికి చెందిన ఇల్లంగి సంగీతరావు, సౌజన్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు సాకేత్(21) తన తండ్రితో కలిసి హమాలీ పనులకు వెళ్తుంటాడు.
ఇటీవల సాకేత్ స్మార్ట్‌ఫోన్ కావాలని తల్లిదండ్రులను అడిగాడు. వారు ఇప్పుడు కొనలేమని చెప్పి వారించారు. అయితే.. కొత్త సంవత్సరం వస్తోందని, తన స్నేహితులంతా ఖరీదైన ఫోన్లు వాడుతున్నారని, తనకు అలాంటిదే కావాలంటూ తల్లిదండ్రులతో సాకేత్ వాగ్వాదానికి దిగాడు. ఏదోలా సముదాయించిన తండ్రి పనికి వెళ్లాడు. తల్లి ఇంట్లోలేని సమయంలో సాకేత్ ఉరేసుకున్నాడు. తల్లి వచ్చి చూసేసరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.