Chevella Tragedy : చేవెళ్లలో తీవ్ర విషాదం.. కారు లోపల ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
Chevella Tragedy : చేవేళ్లలో తీవ్ర విషాదం జరిగింది. అప్పటివరకు సరదాగా ఆడుకున్న చిన్నారులు కారులో విగత జీవులుగా కనిపించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో.. వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం జరిగింది. కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. బంధువుల వివాహానికి వచ్చిన అక్కచెల్లెళ్ల పిల్లలు తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4).. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లారు. కారు డోర్లు లాక్ అయ్యాయి. దీన్ని ఎవరూ గమనించలేదు. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
అప్పటికే చిన్నారులు మృతి..
పిల్లలు ఎంతసేపటికీ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. వారి కోసం వెతికారు. చివరకు కారులో అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డోర్లు ఎలా లాక్ అయ్యాయి.. ఇతర కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
కారులోకి గాలి ప్రసరణ..
కారు డోర్లు లాక్ అయితే.. లోపల ఉన్నవారికి ఊపిరాడకపోవడానికి ప్రధాన కారణం గాలి ప్రసరణ లేకపోవడం. సాధారణంగా కారు క్యాబిన్‌లో బయటి గాలి నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. ఇది పలు మార్గాల ద్వారా జరుగుతుంది. కారులోని వెంటిలేషన్ సిస్టమ్ బయటి గాలిని లోపలికి తీసుకువచ్చి, లోపలి గాలిని బయటికి పంపుతుంది. డోర్లు, కిటికీల అంచుల వద్ద ఉండే సన్నని ఖాళీల ద్వారా కొంత మొత్తంలో గాలి సహజంగా ప్రసరిస్తుంది.
స్థాయికి మించితే.. విషపూరితం..
డోర్లు లాక్ చేసినప్పుడు, కిటికీలు మూసి ఉంచినప్పుడు గాలి ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. లోపల ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నప్పుడు, వారు ఆక్సిజన్‌ను వినియోగిస్తారు. కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తారు. లోపల ఉన్నవారు పీల్చుకున్న కొద్దీ ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. వారు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతుంది. ఒక నిర్దిష్ట స్థాయికి మించి కార్బన్ డయాక్సైడ్ పెరిగితే.. అది విషపూరితమవుతుంది.
పిల్లలతో జాగ్రత్త..
తగినంత ఆక్సిజన్ లేకపోవడం, అధిక కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు కలగలిసి ఊపిరాడకపోవడానికి దారితీస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది స్పృహ కోల్పోవడానికి, మరణానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి కారు ఆపగానే డోర్లు లాక్ చేయాలి. లేకపోతే.. పిల్లలు లోపలికి వెళ్లి ఇలా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. గతంలోనూ చిన్నారులు కారు లోపల చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.