Jagtial District Crime : ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు - ఇలా దొరికిపోయాడు
ఆస్తి కోసం సొంత అన్ననే తమ్ముడు హత్య చేశాడు. ఇందుకు మరో ఇద్దరు కూడా సహకరించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. విచారణ జరిపిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. డబ్బులపై అత్యాశతో హత్య చేసినట్లు తేల్చారు.
ఆస్తి గొడవ, డబ్బు వ్యామోహం జగిత్యాల జిల్లాలో ఇద్దరిని జైల్ పాలు చేసింది. ఆస్తి కోసం రక్తం పంచుకుని పుట్టిన అన్నను కడతేర్చిన తమ్ముడితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు పారిపోయేందుకు వినియోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
అత్యాశనే అసలు కారణం….
బొమ్మల సుమన్, డిల్లేశ్ అన్నదమ్ముల మద్య గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. సుమన్ రోజు మద్యం త్రాగి వచ్చి డిల్లేష్ ను అతని భార్యను కుటుంబ సభ్యులను తిడుతూ, గొడవ చేస్తూ ఉండేవాడు. తల్లికి ఆమె తండ్రి వారసత్వంగా వచ్చిన భూమి సుమారు 36 గుంటలు కుమ్మరిపల్లి హాస్టల్ వద్ద ఉంది. అట్టి భూమిని కుమ్మరపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి 11 లక్షలకు అమ్మకానికి పెట్టగా అతడు బయానగా 2,60,000 రూపాయలు ఇవ్వగా ఆ మొత్తాన్ని డిల్లేష్ ఒక్కడే తనకు అప్పులు ఉన్నాయని చెప్పి వాడుకున్నాడు. బయాన డబ్బులో తనకు వాటా వస్తుందని సుమన్ పలుమార్లు డిల్లేష్ ను అడగగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.
దీంతో అన్నను చంపేస్తే ఆ భూమి బయాన డబ్బులు, భూమి అమ్మగా వచ్చిన మిగిలిన డబ్బులు తనకే చెందుతాయని ఇంకా ఎలాంటి సమస్య ఉండదని భావించి అన్నను హత్యకు చేయాలని పథకం పన్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడైన వంజరి సురేందర్ సహాయం కోరగా అతను కూడా హత్య చేయడానికి అంగీకరించాడు. దీంతో 2న రాత్రి సుమన్ పై డిల్లేశ్ అతని స్నేహితుడు సురేందర్ తో కలిసి కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు.
దుస్తులతో నిందితుడి గుర్తింపు...
హత్య జరిగిన రోజు మృతుడు భార్య లావణ్య ఫిర్యాదు మేరకు డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టిన పోలీసులకు తమ్ముడి రక్తం మరకలు గల దుస్తులు లభించాయి. దీంతో డిల్లేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా మిత్రుడు సురేందర్ తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ రఘు చందర్ తెలిపారు.
హత్యకు ఉపయోగించిన కత్తి పారిపోయేందుకు వినియోగించిన బైక్, సెల్ ఫోన్స్, వారి బట్టలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్ కు తరలించామన్నారు. హత్య కేసును రెండు రోజుల్లో హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన ధర్మపురి సిఐ రాంనర్సింహ రెడ్డి, వెల్గటూర్ ఎస్పై ఉమసాగర్, బుగ్గరం ఎపై శ్రీధర్ రెడ్డి పోలీస్ సిబ్బందిని జిల్లా అశోక్ అభినందించారు.