Kamareddy Police : బిక్కనూరు పోలీసుల ఆత్మహత్యల కేసులో ట్విస్ట్.. 10 ముఖ్యమైన అంశాలు
Kamareddy Police : కామారెడ్డి జిల్లాలో మిస్టరీగా మారిన ముగ్గురి మృతుల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తొలుత శృతి సూసైడ్ చేసుకునేందుకు దూకగా.. ఆమెను కాపాడేందుకు సాయి, నిఖిల్ నిటిలోకి దూకినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముగ్గురు చనిపోయారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఆత్మహత్యల కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకునేందుకు శృతి చెరువులో దూకింది. శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్సై సాయి, నిఖిల్ కూడా మృతిచెందారు. మరోవైపు మిస్టరీగా మారిన ఈ కేసులో విచారణ సాగుతోంది. మృతుల కుటుంబీకులతో పాటు స్నేహితులు, తోటి ఉద్యోగులు, బంధువుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
ఫోన్ చాటింగ్ ఆధారంగా..
అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో మృతి చెందిన బిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ కమ్మరి శృతి, బీబీపేటకు చెందిన తోట నిఖిల్‌ల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముగ్గురూ ఒకేచోట, ఒకేసారి మరణించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. వీరి మధ్య పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఫోన్ చాటింగ్‌లో తెలిసిన సమాచారం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
పరిచయం.. మరణం..
ఈ ముగ్గురి మృతికి వారి మధ్య ఏర్పడిన పరిచయమే కారణంగా తెలుస్తోంది. అది చివరికి ప్రాణాలు తీసుకునేవరకు వచ్చింది. బిక్కనూరు ఎస్సై సాయికుమార్ గతంలో బీబీపేటలో ఎస్‌హెచ్‌వోగా పనిచేశారు. అప్పుడు అక్కడ రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పరిచయం ఏర్పడింది. బీబీపేటకే చెందిన నిఖిల్ కంప్యూటర్ల మరమ్మతులు చేసేవాడు. ఆ పని మీద పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు సాయికుమార్, శృతిలతో పరిచయం ఏర్పడింది.
అసలు ఏం జరిగింది..
1.ఈనెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు బీబీపేటకు చెందిన తోట నిఖిల్ ఇంటి నుంచి తన బైకుపై బయటకు వెళ్లాడు.
2.ఉదయం 11 గంటలకు అతడి సోదరుడు రాజేందర్ ఫోన్ చేయగా.. తాను వేరే పని మీద ఉన్నానని, తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడు. తర్వాత ఫోన్ చేసినా స్పందించలేదు.
3.ఉదయం 11 గంటలకు ఎస్సై సాయికుమార్ టోల్‌ప్లాజా ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
4.ఉదయం 11:30కి ఎస్సైకి ఆయన భార్య మహాలక్ష్మి ఫోన్ చేయగా ఎత్తలేదు. అనుమానం వచ్చిన ఎస్సై చిన్నాన్న లక్ష్మీనారాయణ, సాయికుమార్‌తో సన్నిహితంగా ఉండే ఓ ఎస్సైకి 11:45కు ఫోన్‌చేశారు. అయినా ఫలితం లేదు.
5.మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలోని ఓ దాబాలో ఎస్సై సాయికుమార్, నిఖిల్, శృతి భోజనం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
6.ణధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ముగ్గురు ఎస్సై సాయి సొంత కారులో సదాశివనగర్ మండలం అడ్లూర్-ఎల్లారెడ్డి చెరువుకు చేరుకున్నారు.
7.ఉదయం 11 గంటలకే ఇంటికొస్తానని చెప్పిన శృతి రాకపోయే సరికి.. ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఆమె స్నేహితురాలికి ఫోన్‌చేశారు. ఆమె ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
8.మధ్యాహ్నం 3 గంటలకు శృతి ఫోన్ సిగ్నల్ అడ్లూర్-ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు తెలిసింది.
9.రాత్రి 8 గంటలకు సదాశివనగర్ పోలీసులు చెరువు వద్దకెళ్లి ఎస్సై కారు, చెప్పులు, శృతి, నిఖిల్‌లకు చెందిన ఫోన్లను కనుగొన్నారు.
10.రాత్రి 9కి ఎస్పీ సింధుశర్మ ఆదేశాలతో చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి 12.30కి శృతి, నిఖిల్‌ల మృతదేహాలను వెలికి తీసి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై మృతదేహం లభించకపోవడంతో గురువారం తెల్లవారుజామునే గజ ఈతగాళ్లతో మళ్లీ గాలించారు. ఉదయం 9 గంటలకు సాయికుమార్ మృతదేహం బయటపడింది.