Devadula Project: ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే దేవాదుల పైపులైన్ మూడు చోట్లా లీకవగా.. ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలో ఆదివారం టన్నెల్ లీక్ అవడం కలకలం రేపింది. దీంతో సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు వెంటనే మోటార్లు బంద్ చేసి లీకేజీలను గుర్తించే పనిలో పడ్డారు.
దేవాదుల మూడో దశ పనుల్లో భాగంగా రామప్ప చెరువు నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ కు నీటిని తరలించేందుకు రామప్ప నుంచి దేవన్నపేట వరకు 49.06 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేశారు. దేవన్నపేట పంప్ హౌజ్ నుంచి ధర్మసాగర్ కు నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండగా, ఇక్కడి నుంచి రిజర్వాయర్ వరకు పైపులైన్ వేశారు.
రిజర్వాయర్ సమీపంలో మిషన్ భగీరథ నిర్మాణాల కారణంగా అక్కడ 200 మీటర్ల మేర మరో టన్నెల్ ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉండగా.. క్షేత్రస్థాయిలో పంటలు ఎండుతున్న కారణంగా ఈ నెల 27 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇతర నేతలు దేవన్నపేట పంప్ హౌజ్ లో స్విచ్ ఆన్ చేసి, మోటార్ ను ప్రారంభించారు.
అప్పటి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ కు నీటిని ఎత్తిపోస్తుండగా.. తరచూ లీకేజీలతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో రిజర్వాయర్ సమీపంలోని 200 మీటర్ల టన్నెల్ లీక్ అయ్యింది. దీంతో పెద్ద ఎత్తున నీళ్లు పొలాలను ముంచెత్తాయి. అది గమనించిన స్థానికులు దేవాదుల సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఇరిగేషన్ ఈఈ సీతారాం నాయక్ కు సమాచారం చేరవేశారు.
దేవాదుల నీటిని ఎత్తి పోసేందుకు నిర్మించిన టన్నెల్ లోనే లీకేజీ ఏర్పడటం కలకలం రేపగా.. లీకేజీ ఎక్కడ ఏర్పడిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద మోటార్ ను బంద్ చేశారు. సాంకేతిక కారణాల వల్ల మోటార్ ఆన్ చేసే క్రమంలోనే ఇబ్బందులు ఏర్పడగా.. ఇప్పుడు లీకేజీల కారణంగా తరచూ బంద్ పెట్టాల్సి వస్తుండటంతో నీటి పంపింగ్ కు సమస్యగా మారింది. ఆదివారం మధ్యాహ్నం మోటార్ బంద్ పెట్టిన అధికారులు.. పైపులైన్, టన్నెల్ లీకేజీల వద్ద డీ వాటరింగ్ చర్యలు చేపట్టారు. లీకేజీలను గుర్తించి, రిపేర్లు చేసేందుకు పనులు ముమ్మరం చేశారు.
దేవన్నపేట పంప్ హౌజ్ నుంచి ఓపెన్ చేసిన అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి గండిరామారం, నష్కల్ ట్యాంక్ కు నీటిని విడుదల చేశారు. అదే రోజు గండి రామారం వెళ్లే పైపులైన్ ధర్మసాగర్ మండలం సాయిపేట వద్ద లీకైంది. పెద్ద ఎత్తున నీళ్లు లీకై ఆకాశమెత్తు ఎగసి పడటంతో ఆఫీసర్లు ఆ సమయంలో మోటార్ బంద్ చేసి, రిపేర్లు చేపట్టారు.
దాంతో పాటు ఆదివారం టన్నెల్ లీకేజీతో ఆఫీసర్లు అయోమయంలో పడగా.. ఉనికిచెర్ల నాగుల చెరువు సమీపంలో పైపు లైన్ రెండు చోట్ల లీకైంది. దీంతో గోదావరి నీళ్లు పక్కనే ఉన్న పంట పొలాలను ముంచెత్తాయి. అక్కడ కూడా డీ వాటరింగ్ పనులు స్టార్ట్ చేసి అధికారులు లీకేజీలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. కాగా పంప్ హౌజ్ ను ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే లీకేజీల వ్యవహారం కలకలం రేపుతుండగా.. వాటర్ ప్రెజర్ వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలాఉంటే పంటలకు కీలకమైన దశలో సాగునీరు అందించేందుకు అడ్డంకులు ఏర్పడుతుండగా, అన్నదాతల్లో అయోమయం నెలకొంటోంది. ఓ వైపు లీకేజీలను అరికట్టేందుకు ఆఫీసర్లు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుండగా.. పకడ్బందీ పనులు చేపట్టి లీకేజీలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం