TSSPDCL Advisory : అసలే జోరు వానలు..కరెంటుతో జర భద్రం! పాటించాల్సిన జాగ్రత్తలివే-tsspdcl issues advisory on electricity problems amid statewide rains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsspdcl Advisory : అసలే జోరు వానలు..కరెంటుతో జర భద్రం! పాటించాల్సిన జాగ్రత్తలివే

TSSPDCL Advisory : అసలే జోరు వానలు..కరెంటుతో జర భద్రం! పాటించాల్సిన జాగ్రత్తలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Jul 21, 2023 11:56 AM IST

Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. ఈ మేరకు TSSPDCL అధికారులు పలు జాగ్రత్తలను సూచించారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని... విద్యుత్ వైర్లు ఉన్న చోట్ల అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు.

కరెంట్ తో జాగ్రత్త
కరెంట్ తో జాగ్రత్త

TSSPDCL:తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వానల దాటికి జనం అవస్థలు పడుతున్నారు. వరదల ధాటికి కాలనీలు జలమయం అయ్యాయి. ప్రజల ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండటంతో... విద్యుత్ పట్ల జాగ్రత్లగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సమయంలో కరెంట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు.

సీఎండీ రఘుమా రెడ్డి మాట్లాడుతూ.... వాన కాలం సీజన్ ముగిసే వరకు ప్రతి జిల్లా/ సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామన్నారు. వాతావరణంలో జరిగే మార్పులను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్ర సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తగు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూపెరింటెండింగ్ ఇంజినీర్లకు, చీఫ్ జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు క్రింద సూచించిన స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

- వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్సఫార్మర్ల వద్ద నిలబడరాదు. వీలైనంతవరకు విద్యుత్ వైర్లకు, స్టే వైర్లకు, ట్రాన్సఫార్మర్లకు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుండి దూరంగా ఉంచాలి.

- ఎక్కడైనా రోడ్ మీద, నీటిలో కాని విద్యుత్ తీగ పడి వున్న యెడల ఆ తీగను తొక్కడం గాని, వాటి మీద నుండి వాహనాలు నడపడం చేయరాదు. ఒక వేళ ఎక్కడైనా తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి గాని, కింద ఇవ్వబడ్డ నెంబర్ల ద్వారా సంస్థ దృష్టికి తీసుకురాగలరు.

- విద్యుత్ స్తంభాలను, స్టే వైర్ల ను తాకరాదు. ఒక వేళ ఎవరైనా తాకి విద్యుత్ షాక్ బారిన పడ్డప్పుడు వారిని రక్షించడానికి విద్యుత్ ప్రవాహకాలైన లోహపు రాడ్లను ఉపయోగించకుండా చెక్క/ ప్లాస్టిక్ తో చేసిన పైప్ లను మాత్రమే వాడాలి.

- చెట్ల కొమ్మలపై, వాహనాలపై, ఇతర భవనాలపై తెగి పడ్డ తీగలు ఉన్నట్లయితే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

-భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలియజేయగలరు.

- విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్ కు సంప్రదించే వినియోగదారులు తమ బిల్లు పై ముద్రితమైన USC నెంబర్ ను సిద్ధంగా వుంచుకోగలరు.

- లోతట్టు ప్రాంతాలు, ముంపుకు అవకాశమున్న ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు నీటి ప్రవాహం అధికంగా నున్నప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.

విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382071574, 7382072106, 7382072104 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు. దీనికి తోడు సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురాగలరని ప్రజలను కోరారు.

Whats_app_banner

సంబంధిత కథనం